వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపూర్ గ్రామంలో నిర్వహించే ఎరుకల నాంచారమ్మ జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. జాతరకు మంత్రి సీతక్క హాజరై అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఎరుకల కులస్తులు తరలివస్తారు. మొదటి రోజు లక్ష్మీదేవిపేట గ్రామం నుంచి డప్పు చప్పుళ్లతో నాంచారమ్మ, ఏకలవ్యుడి వేషధారణతో రామానుజాపూర్ వరకు తరలివచ్చారు. అక్కడి నుంచి శివసత్తుల పూనకాలు, భక్తుల కేరింతల మధ్య నాంచారమ్మ జాతరకు తరలివెళ్తారు. ఎరుకల యువతులు, మహిళలు, వృద్ధులు నాంచారమ్మ వేషధారణతో సోది చెప్తూ సందడి చేస్తారు. వారం రోజుల పాటు జాతర కొనసాగనుంది.
జీ రాంజీ చట్టంతో కూలీలకు నష్టం
కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన చట్టం పేరు మార్చి కేంద్రం రూపొందించిన జీ రాంజీ చట్టం కాంట్రాక్టర్లు పని చేసుకునేలా ఉందని, కూలీలకు నష్టం చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి పలుగు, పార చేతబట్టి పనిలో పాల్గొన్నారు. కూలీల కష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి చట్టం పేరు మార్చడాన్ని అసెంబ్లీలో వ్యతిరేకించామని తెలిపారు.
ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కోసం కూలీలు ప్రతి రోజు రెండు గంటలు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి ఎండల నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉదయం ఐదున్నరకే పనులు ప్రారంభించి 10 గంటల లోపు ముగించాలన్నారు.
