క్రిమినల్ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్

క్రిమినల్ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్

ముంబై: రౌడీ షీటర్‌‌తో దగ్గరుండి బర్త్‌ డే కేక్‌ కట్ చేయించి సీనియర్ ఇన్‌స్పెక్టర్‌‌ సెలబ్రేట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌ డే టూ యూ..’ అంటూ పాట పాడి శుభాకాంక్షలు చెప్పి, కేక్‌ తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ ఇన్‌స్పెక్టర్‌‌పై ఉన్నతాధికారులు ఎంక్వైరీకి ఆదేశించారు. 
హత్యాయత్నం సహా అనేక కేసుల్లో నిందితుడు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సీనియర్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర నెర్లేకర్ యూనిఫామ్‌లోనే ఒక రౌడీ షీటర్ బర్త్‌ డే వేడుకలో పాల్గొన్నట్టు క్లియర్‌‌గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇన్‌స్పెక్టర్ ముంబైలోని జోగేశ్వరీ పోలీస్‌ స్టేషన్‌లో సర్వీస్‌లో ఉన్నారు. కేక్‌ కట్ చేసిన రౌడీ షీటర్ పేరు డానిష్​ అని ముంబై పోలీసులు చెబుతున్నారు. అతడు గతంలో హత్యాయత్నం సహా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనపై మహేంద్ర నెర్లేకర్‌‌ను ప్రశ్నించగా.. ఇది పాత వీడియో అని, అక్రమ కట్టడాల కూల్చివేతను పరిశీలించడానికి తాను హౌసింగ్ సొసైటీ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో సీనియర్ సిటిజన్స్‌ తనను సొసైటీ ఆఫీసులోకి పిలిస్తే వెళ్లానని, అక్కడ డానిష్ బర్త్‌  డే కేక్‌తో ఉన్నాడని తనకు ముందుగా తెలియదని వివరించారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని జోన్‌ 10  డిప్యూటీ పోలీస్ కమిషనర్ మహేశ్‌ రెడ్డి తెలిపారు.


బీజేపీ మాజీ ఎంపీ ట్వీట్
ఈ వైరల్ వీడియోపై బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య స్పందించారు. దానిని తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. ‘‘జోగేశ్వరీ పోలీస్‌ స్టేషన్‌లో మాఫీయా డాన్‌ బర్త్‌ డే సెలబ్రేట్‌ చేశారు. థాక్రే సర్కారులో క్రైం బ్రాంచ్ పోలీస్ సచిన్ వాజే వసూళ్లకు పాల్పడుతున్నాడు. మన్షుఖ్ హిరాన్‌ను చంపడానికి ముంబై పోలీసులు సుపారీ తీసుకున్నారు. హోం మినిస్టర్, పోలీస్ కమిషనర్ లంచాల వసూళ్లపై ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు’’ అంటూ పోలీస్ వ్యవస్థ ఉన్న తీరుపై ప్రశ్నించారు.