47వ సారి రంజీ ఫైనల్లో ముంబై

47వ సారి రంజీ ఫైనల్లో ముంబై

బెంగళూరు/ఆలుర్‌‌‌‌: రంజీ ట్రోఫీలో ముంబై 47వ సారి ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్‌‌ జట్టు కూడా 23 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్‌‌కు వచ్చి ముంబైతో అమీతుమీకి రెడీ అయింది. శనివారం ముగిసిన సెమీఫైనల్స్‌‌లో  బెంగాల్‌‌పై  174  పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌‌ విజయం సాధించగా.. ఉత్తర్‌‌ప్రదేశ్‌‌తో పోరును డ్రా చేసుకున్న  41సార్లు చాంపియన్‌‌ ముంబై తొలి ఇన్నింగ్స్‌‌ ఆధిక్యం ఆధారంగా  ముందంజ వేసింది. ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 449/4తో ఐదో రోజు ఆట కొనసాగించిన ముంబై  మరో పదహారు ఓవర్లు ఆడి రెండో ఇన్నింగ్స్‌‌ను 533/4 వద్ద డిక్లేర్‌‌ చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో యూపీ ఛేజింగ్‌‌కు రాకుండా డ్రాకు అంగీకరించింది. తొలి ఇన్నింగ్స్‌‌లో ముంబై 393 స్కోరు చేయగా.. యూపీ 180కే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌‌ల్లో సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్‌‌ (100, 181)కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. మరోవైపు మధ్యప్రదేశ్‌‌ ఇచ్చిన 350 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో 96/4తో ఆట  కొనసాగించిన బెంగాల్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 175 వద్ద ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. ఎంపీ బౌలర్‌‌ కుమార్‌‌ కార్తికేయ (5/67) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. గౌరవ్‌‌ యాదవ్‌‌ (3/19),  సారాంశ్‌‌ జైన్‌‌ (2/69) రాణించారు. ఎంపీ ప్లేయర్ హిమాన్షు మంత్రికి ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. బెంగళూరు వేదికగా ముంబై, మధ్యప్రదేశ్‌‌ మధ్య ఈ నెల 22న ఫైనల్‌‌ మొదలవుతుంది.