చెన్నైకి షాకిచ్చిన ముంబై.. భారీ టార్గెట్ ఛేజ్..

V6 Velugu Posted on May 02, 2021

  • ముంబైకి పొ‘లార్డ్’​
  • ఒంటిచేత్తో ఇండియన్స్‌ను గెలిపించిన కీరన్
  • 219 టార్గెట్ ఛేజ్ చేసి చెన్నైపై అద్భుత విజయం
  • రాయుడు మెరుపులు వృథా

హై ఓల్టేజ్​.. హై స్కోరింగ్​ మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​  చెలరేగిపోయింది..! భారీ టార్గెట్​ ఛేజింగ్​లో పొలార్డ్​ (34 బాల్స్​లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్​).. సింగిల్​ హ్యాండ్​ పెర్ఫామెన్స్​తో బలమైన చెన్నై సూపర్​కింగ్స్​ను చెడుగుడు ఆడుకున్నాడు..! ఆఖరి బాల్​ వరకు క్రీజులో నిలిచి.. భారీ సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు..! ఫలితంగా  ముంబై నాలుగో విక్టరీతో మురిసిపోగా.. చెన్నై సెకండ్​ ఓటమిని మూటగట్టుకుంది..! అంబటి రాయుడు (27 బాల్స్​లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 నాటౌట్​), మొయిన్​ అలీ (36 బాల్స్​లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58), డుప్లెసిస్ (28 బాల్స్​లో2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) బ్యాటింగ్​లో రాణించినా.. బౌలింగ్​ వైఫల్యంతో సీఎస్​కే టార్గెట్​ను కాపాడుకోలేకపోయింది..!!

న్యూఢిల్లీ: నాలుగొందలకు పైగా స్కోర్లు నమోదై.. ఆఖరి బాల్​కు ఉత్కంఠ రేపిన  మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ పైచేయి సాధించింది. సమయానుకూలంగా రన్స్​ చేస్తూ చెన్నై సృష్టించిన పరుగుల కొండను కరిగించేసింది. ఫలితంగా శనివారం జరిగిన లీగ్​ మ్యాచ్​లో ముంబై  4 వికెట్లతో చెన్నైపై గెలిచింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 218/4 స్కోరు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసి గెలిచింది. డికాక్​ (28 బాల్స్​లో 4 ఫోర్లు, 1 సిక్స్​తో 38), రోహిత్​ (24 బాల్స్​లో 4 ఫోర్లు, 1 సిక్స్​తో 35), క్రునాల్​ (23 బాల్స్​లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) కూడా రాణించారు. పొలార్డ్​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​’ అవార్డు లభించింది.

మొయిన్, డుప్లెసిస్​, రాయుడు మోత
ముందుగా బ్యాటింగ్​కు దిగిన చెన్నై ఇన్నింగ్స్​లో డుప్లెసిస్​, మొయిన్​ అలీ, అంబటి రాయుడు పరుగుల మోత మోగించారు. ముంబై బౌలింగ్ సూపర్​ స్టార్లందర్ని సిక్సర్లు, ఫోర్లతో ఉతికి ఆరేశారు. ఇన్నింగ్స్​నాలుగో బాల్​కు రుతురాజ్​ (4) ఔటైనా.. స్టార్టింగ్​లో మొయిన్​, డుప్లెసిస్​ దంచికొట్టారు. దాదాపు 10 ఓవర్లు ఈ ఇద్దరూ పరుగులు వర్షం కురిపిస్తే.. లాస్ట్​లో రాయుడు ఏకంగా సునామీ సృష్టించాడు. ధవళ్​​వేసిన సెకండ్​ ఓవర్​లో డుప్లెసిస్​ 4, 6 బాదితే, థర్డ్​ ఓవర్​లో అలీ సేమ్​ సీన్​ రిపీట్​ చేయగా. పవర్​ప్లేలో సీఎస్​కే 49/1 స్కోరు చేసింది. నీషమ్ బౌలింగ్​లో అలీ 6, 4, 4తో 18 రన్స్​ పిండుకున్నాడు. చహర్​ వేసిన 9వ ఓవర్​లో అలీ, ఫా.. చెరో సిక్సర్​ బాదడంతో ఫస్ట్​ టెన్​లో 95/1 స్కోరు చేసింది. 33 బాల్స్​లో ఫిఫ్టీ కంప్లీట్​ చేసుకున్న అలీ.. సెకండ్​ స్పెల్​కు వచ్చిన బుమ్రా బౌలింగ్​లో 6, 6, 4తో రెచ్చిపోయాడు. అయితే  ఓ స్లో బౌన్సర్​కు డికాక్​కు క్యాచ్​ఇచ్చి ఔట్​కావడంతో సెకండ్​ వికెట్​కు 108 పార్ట్​నర్​షిప్​ ముగిసింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్​కు 12వ ఓవర్​లో పొలార్డ్​ (2/12) డబుల్​ స్ట్రోక్​ ఇచ్చాడు. వరుస బాల్స్​లో డుప్లెసిస్​, రైనా (2)ను ఔట్​ చేయడంతో ముంబై పుంజుకుంది.  చెన్నై స్కోరు 116/4. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ ఎండ్​లో జడేజా (22 నాటౌట్​)ను నిలబెట్టి.. తాను ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 13, 14 ఓవర్లలో మెల్లగా ఆడిన రాయుడు స్లాగ్​ ఓవర్స్​లో తన పవర్ హిట్టింగ్​ను చూపెట్టాడు. చహర్​ బౌలింగ్​లో సిక్సర్​తో గేర్​ మార్చాడు. కులకర్ణి వేసిన 16వ ఓవర్​లో లాంగాన్​ రెండు టవరింగ్​ సిక్సర్లతో ఆటను మరో మెట్టు ఎక్కించాడు. 17వ ఓవర్​లో జడ్డూ ఫోర్​ కొట్టినా, రాయుడు 6, 4​తో 21 రన్స్​ పిండుకున్నాడు. బౌల్ట్​ వేసిన 18వ ఓవర్​లో ఏకంగా 6, 4, 6తో 20 రన్స్​ చేసి 20 బాల్స్​లోనే ఫిఫ్టీ కంప్లీట్​ చేశాడు. 19వ ఓవర్లో బుమ్రా పది రన్సే ఇచ్చినా, లాస్ట్​ ఓవర్లో  6, 4 తో ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చాడు.  అంబటి దెబ్బకు లాస్ట్​8 ఓవర్లలో సీఎస్​కే 102 రన్స్​ చేసింది. 

పొలార్డ్​ ఫటాఫట్​..
కళ్లముందు భారీ టార్గెట్​ ఉండటంతో.. ముంబై కూడా దూకుడుగా ఇన్నింగ్స్​ మొదలుపెట్టింది. ఫోర్​తో ఖాతా మొదలుపెట్టిన డికాక్​ .. థర్డ్​​  ఓవర్​లో  సిక్స్​ కొడితే, రోహిత్​  నాలుగు ఫోర్లు, ​ సిక్సర్​తో జోరు పెంచడంతో పవర్​ప్లేలో ముంబై 58/0తో నిలిచింది. అయితే, ఎనిమిదో ఓవర్​లో రోహిత్​ను ఔట్​ చేసిన శార్దూల్​ ఫస్ట్​ వికెట్​కు 71 రన్స్​ పార్ట్​నర్​షిప్​ బ్రేక్​ చేశాడు. ఆ వెంటనే సూర్యకుమార్​ (3)ను జడేజా, డికాక్​ను అలీ  ఔట్​ చేయడంతో ముంబై 10 ఓవర్లలో 81/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రునాల్​ తో కలిసి పొలార్డ్​  పోరాటం మొదలుపెట్టాడు. 12వ ఓవర్​లో క్రునాల్ సిక్సర్​తో రెచ్చిపోతే.. 13వ ఓవర్​లో పొలార్డ్​  ఏకంగా మూడు సిక్సర్లతో 20 రన్స్​  దంచాడు. ఎంగిడి వేసిన 14వ ఓవర్​లోనూ పొలార్డ్​ బ్యాక్​ టు బ్యాక్​ సిక్సర్లు కొట్టాడు. 15వ ఓవర్​లో 6, 4, 4, 4 తో 17 బాల్స్​లో ఫిఫ్టీ (ఈ సీజన్​లో ఇదే ఫాస్టెస్ట్​) కంప్లీట్​ చేశాడు. టీమ్​ స్కోరు 153/3కి పెంచాడు. 16వ ఓవర్​ (ఎంగిడి) 6, 4, 4తో క్రునాల్​ 16 రన్స్​ రాబట్టడంతో మ్యాచ్​ ముంబై వైపు వెళ్లింది. 17వ ఓవర్​లో  క్రునాల్​ను ఔట్ చేసిన కరన్​ రెండు రన్సే ఇవ్వడంతో విజయ సమీకరణం 18 బాల్స్​లో 48గా మారింది. 18వ ఓవర్​లో సిక్స్​, ఫోర్​ కొట్టిన పొలార్డ్​.. ఐదో బాల్​కు ఇచ్చిన ఈజీ క్యాచ్​ను డుప్లెసిస్​ డ్రాప్​ చేసి​ మూల్యం చెల్లించాడు. తర్వాతి ఓవర్​లో 6, 6 కొట్టిన హార్దిక్ ​ (16),  నీషమ్​ (0) ఔటయ్యారు. ఎంగిడి వేసిన లాస్ట్​ ఓవర్లో 16 రన్స్​ అవసరం అవగా.. టెన్షన్​ పీక్​ స్టేజ్​కు చేరింది.  సెకండ్​, థర్డ్​ బాల్స్​కు 4, 4 .. ఐదో బాల్​కు సిక్సర్​ కొట్టిన పొలార్డ్​ లాస్ట్​ బాల్​కు డబుల్​తో ముంబైని గెలిపించాడు. 

Tagged Cricket, ipl, ipl 2021, Mumbai Indians, Chennai Super Kings

Latest Videos

Subscribe Now

More News