ఢిల్లీ జోరుకు బ్రేక్.. ఐదు వికెట్ల తేడాతో ముంబై విన్

ఢిల్లీ జోరుకు బ్రేక్.. ఐదు వికెట్ల తేడాతో  ముంబై విన్

అబుదాబి: డిఫెండింగ్‌‌ చాంపియన్స్‌‌ ముంబై ఇండియన్స్‌‌ మరోసారి అదరగొట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు కళ్లెం వేసి లీగ్‌‌లో ఐదో విక్టరీ సాధించింది.  డికాక్‌‌( 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), సూర్య కుమార్‌‌( 32 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌‌తో 53) హాఫ్‌‌ సెంచరీలతో చెలరేగడంతో  ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది.   ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 రన్స్‌‌ చేసింది. శిఖర్‌‌ ధవన్‌‌( 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 69 నాటౌట్‌‌),  శ్రేయస్‌‌ అయ్యర్‌‌(33 బంతుల్లో 5 ఫోర్లతో 42) రాణించాడు. ఛేజింగ్‌‌లో 19.4 ఓవర్లు ఆడిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 166 రన్స్‌‌ చేసింది. ఇషాన్‌‌ కిషన్‌‌(28) రాణించాడు.  డికాక్​ ప్లేయర్‌‌ ఆఫ్ ద మ్యాచ్‌‌గా ఎంపికయ్యాడు.

ఆదుకున్న ధవన్‌‌..

బౌల్ట్‌‌ వేసిన ఇన్నింగ్స్‌‌ థర్డ్‌‌ బాల్‌‌కు ఓపెనర్‌‌ పృథ్వీ షా(4) క్యాచ్‌‌ ఔటయ్యాడు. వన్‌‌ డౌన్‌‌లో వచ్చిన రహానె(15) మూడు బౌండరీలు కొట్టి టచ్‌‌లో కనిపించినా క్రునాల్‌‌ వేసిన ఐదో ఓవర్‌‌లో ఎల్బీ అయ్యాడు. పవర్‌‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 46/2పై నిలిచింది.  ఆ తర్వాత ధవన్‌‌– అయ్యర్‌‌ జోడీ థర్డ్‌‌ వికెట్‌‌కు 85 రన్స్‌‌ జోడించింది. అయితే, హాఫ్‌‌ సెంచరీకి దగ్గరైన అయ్యర్‌‌ను ఔట్‌‌ చేసి క్రునాల్‌‌ ముంబైకి బ్రేక్‌‌ ఇచ్చాడు. బౌల్ట్‌‌ వేసిన తర్వాతి ఓవర్‌‌లో బౌండ్రీ కొట్టిన ధవన్‌‌ హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ చేశాడు. అదే ఓవర్‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన  స్టోయినిస్‌‌(13) నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో రనౌటయ్యాడు. 19 ఓవర్లకు 150 మార్కు చేరిన ఢిల్లీ లాస్ట్‌‌ ఓవర్‌‌లో బౌండ్రీ సహా 12 రన్స్‌‌ సాధించింది.

డికాక్‌‌, సూర్య హాఫ్‌‌ సెంచరీలు..

ఛేజింగ్‌‌ను  నెమ్మదిగా మొదలుపెట్టిన ముంబై.. ఐదో ఓవర్‌‌లోనే  రోహిత్‌‌ (5) వికెట్‌‌ కోల్పోయింది. దీంతో సూర్యకుమార్‌‌ క్రీజులోకి రాగా..  అప్పటికే అశ్విన్‌‌  వేసిన 4వ ఓవర్‌‌లో  6, 4 కొట్టి  ఊపు మీద కనిపించిన డికాక్‌‌ జోరు కొనసాగించాడు. నోర్జ్‌‌ వేసిన పవర్‌‌ప్లే లాస్ట్‌‌ ఓవర్‌‌లో మరో  రెండు సిక్సర్లు బాది దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో 33 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ చేసిన డికాక్‌‌.. అశ్విన్‌‌ బౌలింగ్‌‌లో భారీ షాట్‌‌ ఆడి ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లకు ముంబై  79/2పై నిలిచింది.  ఇషాన్‌‌ కిషన్‌‌ వచ్చీరాగానే రనౌట్‌‌నుంచి తప్పించుకోగా..  నెమ్మదిగా స్పీడు పెంచిన సూర్యకుమార్‌‌ ఎదురుదాడి చేశాడు. రబాడ(15వ ఓవర్‌‌) బౌలింగ్‌‌లో భారీ సిక్స్‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసిన సూర్య.. అదే ఓవర్‌‌లో మరో భారీ షాట్‌‌ ఆడి అయ్యర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి డగౌట్‌‌ చేరాడు. ఆ వెంటనే   హార్దిక్‌‌(0) డకౌటవ్వగా,   వేగంగా ఆడిన ఇషాన్‌‌ కూడా ఔటయ్యాడు. దీంతో మ్యాచ్‌‌లో కాస్త హీట్‌‌ పెరిగింది. కానీ ఢిల్లీకి మరో చాన్స్‌‌ ఇవ్వని  కీరన్‌‌ పొలార్డ్‌‌(11 నాటౌట్‌‌), క్రునాల్‌‌(12 నాటౌట్‌‌)  లాంఛనం పూర్తి చేశారు.

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ:  162/4 (శిఖర్‌‌ ధవన్‌‌ 69 నాటౌట్‌‌, అయ్యర్‌‌ 42, క్రునాల్‌‌ 2/26)

ముంబై: 166/5 ( డికాక్‌‌ 53, సూర్య కుమార్‌‌ 53, రబాడ 2/28)