RR vs MI: ముంబై డబుల్ హ్యాట్రిక్ : హార్దిక్ సేనకు భారీ విజయం.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి రాజస్థాన్ ఔట్

RR vs MI: ముంబై డబుల్ హ్యాట్రిక్ : హార్దిక్ సేనకు భారీ విజయం.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి రాజస్థాన్ ఔట్

ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ జట్టుకు తిరుగులేకుండా పోతుంది. వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి టోర్నీలో దూసుకెళ్తుంది. గురువారం (మే 1) రాజస్థాన్ రాయల్స్ పై 100 పరుగుల భారీ తేడాతో గెలిచి టోర్నీలో ఏడో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ లో ముంబై టాప్-4 దంచి కొట్టగా.. బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్ కు చేరువవగా.. మరోవైపు రాజస్థాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్  16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. 

218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వేగంగా ఆడే క్రమంలో వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్ లోనే ఆ జట్టు గత మ్యాచ్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (0) వికెట్ ను కోల్పోయింది. బోల్ట్ వేసిన రెండో ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి దూకుడు ప్రదర్శించిన జైశ్వాల్ (13) నాలుగో బంతికి బౌల్డయ్యాడు. నాలుగో ఓవర్లో నితీష్ రానా (9) పెవిలియన్ కు చేరాడు. ఐదో ఓవర్ లో బుమ్రా రాజస్థాన్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో బంతికి పరాగ్ (16), ఐదో బంతికి హెట్ మేయర్ (0) పెవిలియన్ బాట పట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి సగం జట్టును కోల్పోయి రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ALSO READ | RR vs MI: రోహిత్ వివాదాస్పద నిర్ణయం.. టైమ్ అయిపోయాక DRS తీసుకున్న హిట్ మ్యాన్

పవర్ ప్లే తర్వాత కూడా వికెట్ల వేగం ఆగలేదు. వరుస విరామాల్లో రాజస్థాన్ వికెట్లను కోల్పోతూ వచ్చింది. శుభం దూబే (15), ధృవ్ జురెల్ (11) రెండు బౌండరీలు కొట్టి ఔటయ్యారు. 12 ఓవర్లో కరణ్ శర్మ మ్యాజిక్ తో మరో రెండు వికెట్లు పడ్డాయి. మొదటి బంతికి తీక్షణ, ఐదో బంతికి కార్తికేయ చెరో రెండు పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో ఆర్చర్ (30) హిట్టింగ్ చేయడంతో రాజస్థాన్ స్కోర్ 100 పరుగుల మార్క్ దాటింది. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ,బోల్ట్ తలో మూడు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. పాండ్య, చాహర్ తలో వికెట్ పడగొట్టారు. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రికెల్ టన్ (38 బంతుల్లో 61:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53:9 ఫోర్లు ) మెరుపులకు తోడు సూర్య కుమార్ యాదవ్(23 బంతుల్లో 48:4 ఫోర్లు, 3 సిక్సులు) హార్దిక్ పాండ్య(23 బంతుల్లో 48: 6 ఫోర్లు, సిక్సర్) దంచి కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో తీక్షణ, పరాగ్ చెరో వికెట్ తీసుకున్నారు.