MI vs RCB: ముంబై బ్యాటర్లు ఊచకోత.. 15.3 ఓవర్లలోనే భారీ టార్గెట్ ఫినిష్

MI vs RCB: ముంబై బ్యాటర్లు ఊచకోత.. 15.3 ఓవర్లలోనే భారీ టార్గెట్ ఫినిష్

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఘోర ఓటమి. భారీ స్కోర్ కొట్టినా ఎప్పటిలాగే చెత్త బౌలింగ్ తో మూల్యం చెల్లించుకుంది. 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఆటగాళ్లు మంచి నీళ్లు తగినంత సింపుల్ గా కొట్టేశారు. సూర్య కుమార్ యాదవ్ వీర ఉతుకుడుకు తోడు ఇషాన్ కిషాన్ మెరుపులు ముంబైకు వరుసగా మరో విజయాన్ని అందించాయి. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ముంబై 15.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. 

కళ్ళ ముందు భారీ లక్ష్యం కనబడుతున్నా ముంబై కొంచెం కూడా తడబడలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ విరుచుకుపడడంతో పవర్ ప్లే లోనే 71 పరుగులు చేసి మ్యాచ్ ను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. ముఖ్యంగా కిషాన్ మెరుపులు హైలెట్ గా నిలిచాయి. 34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సులతో 69 పరుగులు చేసి కిషాన్ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి సూర్య విధ్వంసం మొదలయింది. బౌండరీల మోత మోగిస్తూ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేసి చివర్లో ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య(21), తిలక్ వర్మ(16) మ్యాచ్ ను ఫినిష్ చేశారు. 

అంతకముందు డుప్లెసిస్, రజత్ పటిదార్ హాఫ్ సెంచరీలు తోడు చివర్లో దినేష్ కార్తీక్ విధ్వంసం బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దినేష్ కార్తిక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పటిదార్(26 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సులు),డుప్లెసిస్ 40 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లతో 61 పరుగులు హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసుకున్నాడు.