చిక్కుల్లో పృథ్వీషా.. వేధింపులపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశాలు

చిక్కుల్లో పృథ్వీషా.. వేధింపులపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశాలు

భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ వేధింపుల ఫిర్యాదును పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలని ముంబై కోర్టు ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని, జూన్ 19వ తేదీలోపు విచారణ నివేదిక సమర్పించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించింది. అయితే, ఆమె ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌పై ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేయనందుకు పోలీసులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

అంధేరి (ముంబై) సబర్బన్ ప్రాంతంలోని ఒక పబ్‌లో షా తనను వేధించినట్లు సప్నా గిల్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను షా తీవ్రంగా ఖండించారు. 

ఏంటి ఈ గొడవ? ఎవరీమె..?

గతేడాది ఫిబ్రవరిలో పృథ్వీ షా.. తన స్నేహితుడు(ఆశిష్ యాదవ్‌)తో కలిసి డిన్నర్ చేయడానికి ఓ హోటల్‌ ను సందర్శించాడు. ఆ సమయంలో షా, సప్నా గిల్ స్నేహితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తొలుత ఒకరిద్దరికి సెల్పీలు ఇచ్చిన షా.. మిగిలిన వారికి నో చెప్పాడు. దీంతో సప్న ఫ్రెండ్స్ అతన్ని ఇబ్బంది పెట్టారు. దురుసుగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన హోటల్ సిబ్బంది.. వారిని అక్కడినుండి బయటకు పంపారు. దాన్ని అవమానంగా భావించిన సప్న గిల్ స్నేహితులు.. షా హోటల్ నుండి బయటకి రాగానే అతని కారును వెంబడించారు. కారు అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా, అతనిపై దాడికి దిగారు. అందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలోనూ వైరల్‌‌ అయ్యాయి. 

అనంతరం ఈ ఘటనపై పృథ్వీ షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారణగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. సప్నా బేస్‌బాల్ బ్యాట్‌తో పృథ్వీ కారును వెంబడించడం, ఆమె అతని కారు అద్దాన్ని పగలగొట్టడాన్ని నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన సప్న.. పృథ్వీషాపై సెక్షన్ 509 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించింది. పదం, సంజ్ఞ లేదా ఒక మహిళను కించపరిచేలా ఉద్దేశించిన చర్య, 354 (వేధింపులు), 324 (ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా స్వచ్ఛందంగా గాయపరచడం వంటి సెక్టన్ల కింద ఫిర్యాదులో పొందుపరిచింది. 

అయితే, షా ఆమెను వేధించినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఆమె ఫిర్యాదును తిరస్కరించారు. దీంతో ఆమె మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.

ALSO READ :- Kaia Arua: 33 ఏళ్లకే ప్రాణాలు వదిలిన మహిళా క్రికెటర్

కాగా, పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఈ ఓపెనర్ మిగిలిన మ్యాచ్‌ల్లో తుదిజట్టులో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 43 పరుగులు చేసిన షా.. విశాఖపట్టణం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులకే పెవిలియన్ చేరాడు.