26/11 తరహాలో మళ్లీ దాడి చేస్తం

26/11 తరహాలో మళ్లీ దాడి చేస్తం

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  మళ్లీ ‘26/11’  తరహా దాడులు చేస్తామంటూ పాకిస్తాన్​ ఫోన్​ నెంబర్​ నుంచి మెసేజ్​ వచ్చినట్టు సిటీ పోలీస్​ కమిషనర్​ వివేక్​ పన్సల్కర్​ తెలిపారు. వర్లీ నుంచి ఆపరేట్​చేస్తున్న ముంబై ట్రాఫిక్​ పోలీస్​ హెల్ప్​లైన్​ వాట్సాప్​ నెంబర్​కు ఈ మెసేజ్​ వచ్చిందని వివరించారు. శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. మెసేజ్​ వచ్చిన వెంటనే యాంటీ టెర్రరిజం స్క్వాడ్​తో పాటు సిటీ పోలీసులను అలర్ట్​ చేశామని తెలిపారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల టైంలో ఈ మెసేజ్​ వచ్చిందన్నారు. 26/11 దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు అజ్మల్​ కసబ్​తో పాటు ఆల్​ఖైదా లీడర్​ అయ్మన్​ అల్​ జవహ్రీ పేరును కూడా ప్రస్తావించారని వివరించారు.

దాడుల కోసం తమ వాళ్లు కొంత మంది ముంబైలోనే ఉంటూ ప్లాన్​ చేస్తున్నారని మెసేజ్​లో ఉన్నట్టు తెలిపారు. ఈ మెసేజ్​ను సీరియస్​గా తీసుకున్నామని, ప్రజల భద్రతతో పాటు వారి రక్షణ బాధ్యత ముంబై పోలీసులదే అన్నారు. బెదిరింపు మెసేజ్​ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, కోస్టల్​ ఏరియా సెక్యూరిటీని కూడా అలర్ట్​ చేశామన్నారు. కోస్ట్​ గార్డ్స్​తో కో–ఆర్డినేట్​ చేయాల్సిందిగా సూచించామని తెలిపారు. సాగర్​ కవచ్​ ఆపరేషన్​ను లాంచ్​ చేశామని పేర్కొన్నారు. ఈ ప్లాన్​ను ఆరుగురు కలిసి ఎగ్జిక్యూట్​ చేస్తున్నారని మెసేజ్​లో ఉందని తెలిపారు. ఇప్పుడు చేసే దాడులు 26/11ను గుర్తు చేస్తాయంటూ బెదిరించినట్టు వివరించారు.