హైదరాబాద్లో హై అలర్ట్.. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు

హైదరాబాద్లో హై అలర్ట్.. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు
  • రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసుల సోదాలు 
  • భద్రతా బలగాల ఆధీనంలోకి ఎయిర్​పోర్ట్
  • అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పిలుపు

హైదరాబాద్ సిటీ, పద్మారావు నగర్/​వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ కారు పేలుడుతో హైదరాబాద్‌లో హైఅలర్ట్ విధించారు. సిటీ వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు. ప్రతి పోలీస్​స్టేషన్​పరిధిలోని ప్రధాన రోడ్లపై వాహనాలను చెక్ చేశారు. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్​స్టేషన్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి ఇతర రైల్వేస్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, పోలీసులు సోదాలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఐడీ ప్రూఫ్‌‌‌‌లు, లగేజీలను తనికీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీని పెంచారు. పార్కింగ్, ఇతర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్​తో జల్లెడ పట్టారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఆక్టోపస్ కమాండోస్ ను మోహరించారు. మెట్రో స్టేషన్లలోనూ పోలీసులు సోదాలు చేపట్టారు.

హైదరాబాద్​లో ఉగ్రవాది పట్టుబడడంతో ..

రెండు రోజుల కింద గుజరాత్​యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​ పట్టుకున్న టెర్రరిస్టుల్లో హైదరాబాద్​కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ కూడా ఉండడంతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఢిల్లీలో బాంబ్ పేలుడు జరగడంతో మరింత అలర్టయ్యారు. నగరంలోని మాల్స్, సింగిల్​స్క్రీన్​సినిమా హాల్స్, మల్టీప్లెక్స్​లు, షాపింగ్​కాంప్లెక్స్​ల వద్ద ప్రైవేట్​సెక్యూరిటీని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చారు. డిటెక్టర్లు తప్పని సరిగా వాడాలని, ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా, ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా డయల్​100కు కాల్ చేసి చెప్పాలని కోరారు. ఎక్కడైనా సూట్​ కేసులు, లగేజీ బ్యాగులు, కార్ల వంటివి ఎవరూ తీసుకువెళ్లకుండా చాలాకాలంగా ఉంటే వాటి దగ్గరకు వెళ్లకూడదని, తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

జూబ్లీహిల్స్​పోలింగ్​కు భద్రత పెంపు

మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్​లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్​కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్​బలగాలను మోహరించగా.. 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచే అవకాశాలున్నాయి. యూసుఫ్‌‌‌‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, షేక్​పేట, ఫిల్మ్‌‌‌‌నగర్ తదితర ప్రాంతాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్ ఏరియాల్లోని లాడ్జీల్లో గెస్ట్ రిజిస్టర్లను చెక్​చేస్తున్నారు.