- మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా కోసం గాలింపు
సికింద్రాబాద్, వెలుగు: ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ విధ్వంసానికి పాల్పడిన నిందితుడికి ఆశ్రయం కల్పించిన మెట్రో పోలీసు హోటల్ యజమాని రషీద్, మేనేజర్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రషీద్‌ను ముంబైలో అరెస్ట్ చేయగా, మేనేజర్ రెహమాన్ ను సిటీలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వ్యక్తిత్వ వికాసం పేరుతో యువకులకు క్లాసులు నిర్వహించి రెచ్చగొట్టిన మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మునావర్జమా ప్రసంగాలకు ప్రేరేపితుడయ్యే సలీం ఈనెల14న ముత్యాలమ్మ గుడిపై దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
బస్సులపై రాళ్లు రువ్విన వారిపై కేసు
గుడి ఘటనను నిరసిస్తూ శనివారం నిర్వహించిన బంద్ సందర్భంగా పలువురు ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారంటూ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే ఐదుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామని, సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాక, పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.