- పోటాపోటీగా వలస ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు
- తనకే ఓటు వేయాలని వేడుకోలు
- ముందు రోజేరావాలని వినతులు
- అన్నీ చూసుకుంటామని హామీ
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఓట్లు ఉన్న కొందరు ఉపాధి కోసం వెళ్లి ముంబయిలో నివాసం ఉంటున్నారు. వారి ఓట్లు ఉన్న వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి ముంబయిలోని వాళ్ల ఇండ్లకు వెళ్లి మరీ ప్రచారం చేశారు. తనకే ఓటు వేయాలని వేడుకున్నాడు. అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పుకున్న సదరు అభ్యర్థి ఓటర్లు దావతు ఇచ్చి వచ్చాడు.
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు ఉన్నాయి. 104 వార్డుల్లో 1,32,711 ఓటర్లు ఉన్నారు. రెండు వార్డులు ఏకగ్రీవం కావడంతో 102 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్కో వార్డులో 900 అంతకు పైగా ఓట్లున్నాయి.
ఒక్కోసారి ఒక్క ఓటు కూడా గెలుపోటములను నిర్ణయిస్తాయి. దీంతో వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లను రాబట్టు కోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్లు చేయడమే కాదు.. చివరకు ఓటర్లు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి మరీ ఓట్లు వేయడానికి రావాలని కోరుతున్నారు.
ఉద్యోగం, ఉపాధి కోసం వలస
ఉపాధి, ఉద్యోగాల నిర్వహణ కోసం జిల్లాలోని అనేక కుటుంబాలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. అయితే వేరే చోట్ల నివాసం ఉన్నప్పటికీ వీరి ఓట్లు మున్సిపాలిటీల్లోనే ఉన్నాయి. వీరు ఎక్కువగా ముంబయి, బీవండి, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి వాళ్లు ఒక్కో మున్సిపాలిటీ నుంచి వెళ్లిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. కొందరైతే ఉపాధి కోసం నిత్యం హైదరాబాద్‌కు ఉదయం వెళ్లి రాత్రి వేళల్లో వస్తుంటారు. ఓటర్లు తక్కువ మందే అయినా వారు వేసే ఓట్లు గెలుపోటములు నిర్ణయిస్తాయి.
వలస ఓటర్లకు ఫోన్లు
మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే వారు ప్రతి ఓటును రాబట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో ఉన్న వారిని రెగ్యులర్‌గా కలుస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్లతో మాట్లాడుతూ 'తక్కేవేం చేయం... పోటీ అభ్యర్థి కంటే ఎక్కువే చూసుకుంటాను' అని చెబుతున్నారు. అయితే వార్డులో ఓట్లు ఉండి.. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు, ఫోన్ నెంబర్లు సేకరించుకున్న అభ్యర్థులు వారికి ఫోన్ చేసి వరసలు కలుపుకుంటున్నారు..
ఖర్చులన్నీ కలిపి
స్థానికంగా ఉన్న ఓటరుకు ఒక్కొక్కరికీ రూ. 3000 వరకూ ఇవ్వాలని కొందరు నిర్ణయం తీసుకున్నారు. పోటీ అభ్యర్థి బట్టి మరింత అమౌంట్ పెంచే ఆలోచన చేయడానికి రెడీగా ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటరుకు ఒక్కొకరికీ ఇక్కడి ఓటరుకు ఇచ్చే అమౌంట్‌కు మరికాస్త కలపడంతో పాటు 'ట్రాన్స్‌పోర్టుతో పాటు అన్ని ఖర్చులు' ఇస్తామని చెబుతున్నారు. ముంబాయి వంటి దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ. 10 వేలకు మించి ఖర్చు చేసే పరిస్థితి కన్పిస్తోంది. అదే హైదరాబాద్‌లో ఉన్న వాళ్లయితే ఓటకు రూ. 5 వేలకు వించి ఖర్చు అయ్యేట్టుగా ఉంది.
ముంబయికి వెళ్లి మరీ ప్రచారం
చౌటుప్పల్‌లోని ఓ వార్డులో ఓట్లున్న పది మందికి పైగా ముంబయిలో నివాసం ఉంటున్నారు. వారి ఓటు అభ్యర్థించడానికి ఆ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి ఏకంగా ముంబయికే వెళ్లారు. వారు ఉంటున్న ఇళ్లకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. పైగా వారందరికీ దావత్ కూడా వచ్చినట్టుగా తెలిసింది. రానుపోనూ ఖర్చులు కూడా ఇస్తామన్నట్లు తెలిసింది.
అదే విధంగా ఒక రోజు ముందే రావాలని దగ్గరుండి మంచిగా చూసుకుంటానని చెప్పి వచ్చేశాడు. రెండ్రోజులకు సంబంధించిన వేతనం, ఆలేరుకు చెందిన ఓ అభ్యర్థి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని మరీ వేడుకుని వచ్చారు
