
- విడుదల చేసిన మున్సిపల్ శాఖ
- 19 రోజులు గడువు.. వచ్చే నెల 2న తుది నోటిఫికేషన్
- గజ్వేల్ డీలిమిటేషన్ ఫైల్‌ను సీఎంకు పంపిన సీడీఎంఏ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజన షెడ్యూల్‌ను మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి ఇటీవల రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరు నియోజకవర్గంలో కొత్తగా జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు అదే నియోజకవర్గంలోని ఇస్నాపూర్ లో సైతం వార్డుల విభజన చేపట్టాల్సి ఉంది. బుధవారం నుంచి ఈ మూడు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ స్టార్ట్ అయి వచ్చే నెల 2న ముగియనుంది.
అదే రోజు తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. బుధవారం ఫీల్డ్ సర్వే పూర్తి చేసి, గురువారం ప్రజలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు నోటీసు జారీ చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 23 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 24 నుంచి 28 వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలపై విచారణ జరపనున్నారు.
వాటిని 29, 30న కలెక్టర్‌కు మున్సిపల్ అధికారులు పంపించనున్నారు. 31న సీడీఎంఏకి, వచ్చే నెల 1న ప్రభుత్వానికి సీడీఎంఏ అధికారులు రిపోర్ట్ అందజేయనున్నారు. వచ్చే నెల 2న ఈ మూడు మున్సిపాలిటీల వార్డుల విభజనపై తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా 19 రోజుల్లో పూర్తి చేయనున్నట్టు సెక్రటరీ జీవోలో పేర్కొన్నారు.
గజ్వేల్ ఫైల్ సీఎంకు..!
మల్లన్నసాగర్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలు గజ్వేల్ మున్సిపాలిటీల్లోనే ఉన్నాయి. కానీ, గత ప్రభుత్వం వీటిని గ్రామపంచాయతీ కేటగిరీలో పెట్టడంతోపాటు ఎన్నికలు కూడా నిర్వహించారు. పాలకవర్గం గడువు ముగియడంతో అసలు సమస్య ముందుకొచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో ఉండి గ్రామపంచాయతీగా పరిగణించడం సరైందికాదని ప్రభుత్వం గుర్తించింది. అయితే, ఇప్పటికే వార్డుల విభజన పూర్తిచేసిన గజ్వేల్‌లో కూడా కొత్త కాలనీల నేపథ్యంలో వార్డులను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ వార్డుల విభజన అంశం ఫైల్ ను మున్సిపల్ అధికారులు సీఎంకు పంపినట్టు తెలుస్తోంది.