మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన పోలింగ్

మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన పోలింగ్

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఉదయం 7గంటల నుంచి 5గంటల వరకు ఎన్నికలు జరిగాయి. 5గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఎన్నికలు ముగిసిన డివిజన్లలో.. బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు.. అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, నకిరేకల్ మున్సిపాలిటీలు, హైదరాబాద్ లోని లింగోజిగూడ డివిజన్ కు  ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా.. అన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అయితే వరంగల్-ఖమ్మం కార్పొరేషన్లలో టీఆర్ఎస్ -బీజేపీ కార్యకర్తల మధ్య కొన్ని డివిజన్లలో గొడవలయ్యాయి. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో గొడవలు సద్దుమణిగాయి. 

ఒకవైపు కరోనా-మరోవైపు ఎండలు కారణంగా ఈసారి అన్ని చోట్ల గతంలో కంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందనే భయంతో.. చాలామంది ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. గ్రేటర్ వరంగల్ లో గతం కంటే..  10శాతం పోలింగ్ తక్కువగా నమోదైంది. 2016 ఎన్నికల్లో 60.38శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి భారీగా పోల్ పర్సంటేజ్ తగ్గింది. 5గంటల వరకు  49.25శాతమే పోలింగ్ నమోదు అయింది.

సాయంత్రం  5 గంటల వరకు నకిరేకల్ మున్సిపాలిటీలో 86.3 శాతం పోలింగ్ నమోదయింది. రంగారెండ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో 85. 4 శాతం ఓటింగ్ నమోదయింది. ఖమ్మంలో 57 శాతం పోలింగ్ రికార్డయింది.