కరోనా భయం..  తగ్గిన పోలింగ్

కరోనా భయం..  తగ్గిన పోలింగ్
  • గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లో 54, ఖమ్మంలో 60% ఓటింగ్‌‌‌‌
  • సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్లలోనూ 70 % లోపే
  • కొత్తూరు, నకిరేకల్‌‌‌‌లలోనే 85% దాటిన పోలింగ్‌‌‌‌
  • పైసలిచ్చి, వెహికల్స్‌‌‌‌ పెట్టి ఓటర్లను తరలించిన్రు


హైదరాబాద్, వెలుగు: మినీ మున్సిపల్ పోలింగ్‌‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. వైరస్‌‌ భయంతో ఓటర్లు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. బూత్‌‌ల దగ్గర ఓటర్ల క్యూ లైన్లు పెద్దగా కనిపించలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌‌లో 54.74 శాతం, ఖమ్మం కార్పొరేషన్‌‌లో 59.80 శాతమే పోలింగ్‌‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌‌ఈసీ) వెల్లడించింది. సిద్దిపేటలో 67.18, అచ్చంపేటలో 68, జడ్చర్లలో 66.6 శాతం మందే ఓటేశారని తెలిపింది. కొత్తూరు మున్సిపాలిటీలో 85.42 శాతం, నకిరేకల్‌‌లో 86.65 శాతం ఓటింగ్ నమోదైందని ప్రకటించింది. మొత్తంగా రెండు కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీల్లో పోలింగ్‌‌ తగ్గిందని చెప్పింది. 7 అర్బన్‌‌ లోకల్‌‌ బాడీల్లో కలిపి 69.7 శాతం ఓటింగ్‌‌ నమోదైందని వెల్లడించింది. కాగా, అధికారులు బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి స్ర్టాంగ్ రూమ్‌‌లలో భద్రపరిచారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఎన్నికలు వద్దని చెప్పినా వినలె

కరోనా టైమ్‌‌లో ఎన్నికలు పెడితే వైరస్‌‌ మరింత విజృంభిస్తుందని, ఓటేసేందుకు ఓటర్లు రారని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఓటర్లు మొత్తుకున్నా ప్రభుత్వం, ఎస్‌‌ఈసీ వినలేదు. దీంతో ఫిబ్రవరిలో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌‌ కూడా నమోదవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు 76.41 శాతం నమోదవగా ఈసారి ఇటు వరంగల్‌‌లో, అటు ఖమ్మంలో 60 శాతం పోలింగ్​మించలేదు. 2016 ఎన్నికల్లో వరంగల్ కార్పొరేషన్‌‌లో 60.38 శాతం, ఖమ్మంలో 67.68 శాతం పోలింగ్ నమోదైంది. 

పోలింగ్‌‌ రోజూ డబ్బుల పంపకం

పోలింగ్ రోజు కూడా కేంద్రాల వద్ద అధికార పార్టీ నేతలు ఓటర్లకు డబ్బుల పంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు పట్టుబడ్డారు. వరంగల్‌‌ 2వ డివిజన్‌‌లోని గుండ్ల సింగారం పోలింగ్​కేంద్ర దగ్గర టీఆర్‌‌ఎస్ అభ్యర్థి భర్త సింగూలాల్ డబ్బులు పంచుతుండగా రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వరంగల్‌‌లో పోలింగ్ రోజున ఒక్కో ఓటుకు రూ.3 వేల చొప్పున పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు ఓటర్లకు టీఆర్‌‌ఎస్ పార్టీ నేతలు కారు గుర్తుకే ఓటు వేయాలనే మాస్కులు ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపారు. సిద్దిపేటలోని 24వ వార్డులో రిగ్గింగ్ జరిగిందని గుడ్ల సిద్ధి రాములు అనే ఓటరు ఫిర్యాదు చేశారు. తన ఓటు ఎవరో వేశారని ఆరోపించారు. ఖమ్మం కార్పొరేషన్‌‌లో పోలింగ్ ఉద్రిక్తతలు, ప్రతిపక్షాల నిరసన మధ్య సాగింది. కార్పొరేషన్ లోని 55వ, 57వ డివిజన్‌‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ వారిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. 42వ వార్డు టీఆర్ఎస్‌‌‌‌ అభ్యర్థి భర్త పోలింగ్ కేంద్రంలోకి ఎక్కువగా వెళ్లడంపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. 70వ నంబరు పోలింగ్ బూత్‌‌లో అధికారుల పొరపాటు వల్ల గుండ్ల స్వరూప ఓటును  రచ్చ సరిత అనే మహిళ వినియోగించుకున్నారు. ప్రీసైడింగ్ అధికారి సూచనతో రచ్చ సరిత నంబర్‌‌పై గుండ్ల స్వరూప ఓటు వేసింది.

కరోనా రూల్స్ పాటించలె

కరోనా టైమ్‌‌లో ఎన్నికలు పెట్టిన సర్కారు, ఎస్‌‌ఈసీ ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు. కరోనా రూల్స్‌‌ ప్రకారం ఏర్పాట్లు చేశామన్నా నిర్వహణలో అవేం కనిపించలేదు. ఓటర్లు భౌతిక దూరం పాటించేందుకు కొన్ని కేంద్రాల్లో గుర్తులు వేయలేదు. వేసిన చోట పాటించేలా ఓటర్లకు అవగాహన కల్పించలేదు. పోలింగ్ కేంద్రాల బయట పార్టీల కార్యకర్తలు గుంపులు, గుంపులుగా కనిపించారు. కానీ కరోనా రూల్స్‌‌ పాటించకుండా కొన్ని చోట్ల క్యాండిడేట్లు పైసలు ఇచ్చి, వెహికల్స్‌‌ ఏర్పాటు చేసి ఓటర్లను తీసుకొచ్చారు. ఒక్కో ఆటోలో ఆరేడు మందిని తరలించారు. దీని వల్లే కాస్త పోలింగ్‌‌ పర్సంటేజ్‌‌ కాస్త పెరిగిందని చెబుతున్నారు.

ఎక్కడా కరోనా రూల్స్ సక్కగ పాటించలె

కరోనా విజృంభిస్తున్న టైమ్‌‌‌‌లో ఎన్నికలు పెట్టిన సర్కారు, ఎస్‌‌‌‌ఈసీ ఎక్కడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. కరోనా రూల్స్‌‌‌‌ ప్రకారం ఏర్పాట్లు చేశామని చెప్పినా అవేం కనిపించలేదు. భౌతిక దూరం పాటించేందుకు కొన్ని కేంద్రాల్లో గుర్తులు వేయలేదు. పోలింగ్ కేంద్రాల బయట పార్టీల కార్యకర్తలు గుంపులు, గుంపులుగా కనిపించారు. అధికారులు, పోలీసుల పట్టనట్లు వ్యవహరించారు. అనారోగ్యంతో ఉన్న వారు, దివ్యాంగులనే పోలింగ్‌‌‌‌ కేంద్రాలకు వెహికల్స్‌‌‌‌లో తీసుకురావాలి. కానీ కరోనా రూల్స్‌‌‌‌ పాటించకుండా కొన్ని చోట్ల క్యాండిడేట్లు పైసలు ఇచ్చి, వెహికల్స్‌‌‌‌ ఏర్పాటు చేసి ఓటర్లను తీసుకొచ్చారు. ఒక్కో ఆటోలో ఆరేడు మందిని తరలించారు.