- కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే మున్సిపాలిటీల్లో మరింత అభివృద్ధి
- మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు
- మహిళలకు చీరలు, వడ్డీలేని రుణాలు పంపిణీ
- ఈజీఎస్ పేరు మార్పు నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న మంత్రి
కోల్‌బెల్ట్/చెన్నూరు/నర్సాపూర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించి, గెలిచే అవకాశమున్న వారికే టికెట్లు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పంచాయతీల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం (ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడానికి వ్యతిరేకంగా భీమారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రి నిరసన వ్యక్తం చేశారు.
అంతకుముందు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ ఆశావాహులతో మంత్రి సమావేశమై.. దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు యూపీఏ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారని, దీంతో గ్రామాల్లో వలసలు తగ్గాయని గుర్తుచేశారు.
100 రోజుల పాటు పని దొరకడంతో గ్రామాల్లో పేదలకు జీవనోపాధి లభించి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ పథకానికి మొదట నిధులు తగ్గించిందని, తర్వాత గాంధీ పేరుతో పాటు స్కీమ్ స్వరూపాన్ని మార్చి రైతులు, కూలీలు, భూమిలేని పేదల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ స్కీమ్‌లో గతంలో 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం వాటా 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాలపై 40 శాతం భారం మోపిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఏకతాటిపై నిలబడి పోరాటాలు చేస్తున్నారని చెప్పారు.
స్వయం సహాయక సంఘాలకు పెద్దపీట..
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వైఎస్ హయాంలో పావలా వడ్డీ రుణాన్ని అందించగా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు ఇస్తున్నదని తెలిపారు.
మహిళా క్యాంటీన్ల ద్వారా ఉపాధి కల్పిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరుపై ఇస్తున్నామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మహిళలకు పెట్రోల్ బంక్ మంజూరు చేశామని, చెన్నూరులో మరో బంక్ ఇస్తామన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో రూ.76 లక్షలు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.1.71 కోట్లు, మందమర్రిలో రూ.1.69 కోట్లను మహిళలకు రుణాలుగా అందించామన్నారు. మరోవైపు, చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మంత్రి హామీ ఇచ్చారు.
వివిధ వార్డుల్లో రూ.45 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.23 కోట్లు కూడా మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు,పట్టణాల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, డీఆర్‌డీఏ కిషన్, చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు రూ.23 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు..
మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే సునీతా రెడ్డితో కలిసి 157 మహిళా సంఘాలకు రూ.66,93,541 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.23 వేల కోట్లు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామన్నారు.
ప్రతి నియోజకవర్గానికి మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. స్వయం ఉపాధి యూనిట్లు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీతా రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ శ్రీనివాస్ రావ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
