ఈనెల 14 వరకు నామినేషన్లు స్వీకరణ

ఈనెల 14 వరకు నామినేషన్లు స్వీకరణ

నల్గొండ, వెలుగు: మునుగోడు బైపోల్ నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. కోడ్ ఉల్లంఘనతోపాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాల గురించి చర్చించారు. మోడల్ కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాతలు ఉంటే చెరిపేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 16 టీమ్‌‌లు ఏర్పాటు చేశామని.. సభలు, సమావేశాల వీడియోగ్రఫీకి 7 టీమ్‌‌లు.. డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేందుకు వాహనాల తనిఖీకి ఎఫ్ఎస్‌‌టీ(ఫ్లయింగ్ స్క్వాడ్) 14 టీమ్ లు, 18 ఎస్ఎస్‌‌టీ టీమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహాలను, వాహనాలను ఎన్నికల ప్రచారానికి వాడకూడదని అన్నారు.

17న ఉపసంహరణ

చండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారు. అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరణ ఉండదు. నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థి గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి 40 లక్షలుగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు.