
మూడు నెలలకోసారి మర్రిగూడకు వచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఓటు వేసి మోసపోవద్దు.. గోస పడొద్దన్నారు. మర్రిగూడ అభివృద్ధి తప్ప ఇక్కడి ప్రజలు ఏం అడగటం లేదన్నారు. అదృష్టం కొద్ది మర్రిగూడకు ఇంచార్జీగా తాను రావడం జరిగిందన్నారు. ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో మర్రిగూడ గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గతంలో ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటెల రాజేందర్ ఆరోగ్యం బాగలేదన్నారని సాకులు చెప్పారన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలాగే చేస్తారని తెలిపారు.బీజేపీ రాజకీయం అలాగే ఉంటుందని హరీష్ రావు విమర్శించారు.
చెయ్యి విరిగిందని ఒకరు, కాలు విరిగిందని మరొకరు ప్రచారం చేస్తూ బీజేపీ ఓట్లు పొందాలని చూస్తుందని విమర్శించారు. శివన్నగూడెం చెరువులో నీళ్ళు పోయించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామినిచ్చారు. తెలంగాణ పథకాల వల్ల భూమి విలువ భారీగా పెరిగిందన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే, కర్ణాటకలో వంద ఎకరాలు వస్తుందన్నారు. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో అందరి కళ్ళ ముందే ఉందన్నారు.