కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడేవాడే నాయకుడని నిరూపించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్లగొండ జిల్లాలో మరోసారి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 151 మంది విద్యార్థులకు సుమారు 24.5 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేసి వారి ఉన్నత చదువులకు భరోసానిచ్చారు.
అయితే ఆ సభా ప్రాంగణంలో ఒక హృదయ విదారక సన్నివేశం చోటుచేసుకుంది. శివాని అనే విద్యార్థిని తన తమ్ముడు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని, తమ పరిస్థితి బాగోలేదని కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధను చూసి చలించిపోయిన రాజగోపాల్ రెడ్డి.. తక్షణమే లక్ష రూపాయల సాయం ప్రకటించడమే కాకుండా, మరో 2.5 లక్షల ఎల్.ఓ.సి (LOC) మంజూరు చేసి ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపారు.
కేవలం శివానికే కాదు మునుగోడుకు చెందిన చిన్నారి మోక్షిత్‌కు కూడా ఆయన అండగా నిలిచారు. మల్టీ ఆర్గాన్ వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడి చికిత్స కోసం 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రెయిన్‌బో ఆసుపత్రిలో బాబుకు మెరుగైన వైద్యం అందేలా భరోసా ఇచ్చారు.
కష్టాల్లో ఉన్నామని చెప్పిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించి, వేదికపైనే ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజా సేవ అని ఆయన మరోసారి చాటి చెప్పారు.

