కేసు విత్​డ్రా చేసుకోలేదని హత్య

కేసు విత్​డ్రా చేసుకోలేదని హత్య

పాత కక్షల కారణంగా యువకుడిని దారుణంగా హత్యచేసిన సంఘటన రామంతాపూర్ లో చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, వెలిశాలకు చెందిన మోగిలి యాదగిరి మూడు సంవత్సరాల క్రితం కుటుంబంతో సిటీకొచ్చాడు. రామంతాపూర్​లోని కేసీఆర్ నగర్ లో ఉంటున్నాడు. యాదగిరికి ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన ప్రసాద్(22)​ నల్లకుంటలోని ఓ రియల్​ఎస్టేట్​ఆఫీస్​లో ఆఫీస్​బాయ్​గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ప్రసాద్​ఇంట్లో ఆఫీసుకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాడు. కానీ ఇంటికి రాలేదు. ఆదివారం ఉదయం 6 గంటలకు కేసీఆర్​నగర్, శ్రీనగర్​కాలనీలోని హ్యాపీ బార్​వద్ద యువకుడి శవం పడి​ఉందని ప్రసాద్​కుటుంబ సభ్యులకు స్థానికుల ద్వారా తెలిసింది.

హుటాహుటిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న ప్రసాద్​ను చూసి బోరున విలపించారు. దారుణంగా కొట్టడంతోనే ప్రసాద్​మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అయితే 4 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ముస్తాక్, నాగరాజు ప్రసాద్​తో గొడవపడినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ముస్తాక్, నాగరాజు ప్రసాద్ ఇంటికి వెళ్లి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసినట్లు చెప్పారు. దీనిపై ఉప్పల్ పీఎస్ లో కేసు పెట్టినట్లు వివరించారు. కొన్నాళ్లుగా కేసును విత్​డ్రా చేసుకోమని బెదిరిస్తున్నట్లు తెలిపారు. తమతో గొడవకు దిగిన ముస్తాక్, నాగరాజు, రమేష్, సాయి, సంతోష్, ప్రశాంత్, రాజు, సునీల్ తమ కొడుకును హత్య చేసిఉంటారని ఆరోపించారు. ఈ మేరకు ప్రసాద్​తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.