Musheer Khan: ఇలాగైతే టీమిండియాలో చోటు ఖాయం: వరుసగా మూడు సెంచరీలు.. 16 వికెట్లు

Musheer Khan: ఇలాగైతే టీమిండియాలో చోటు ఖాయం: వరుసగా మూడు సెంచరీలు.. 16 వికెట్లు

ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్ ఇంగ్లాండ్ లో సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. టెస్ట్ ఫార్మాట్ లో జరుగుతున్న ఈ సిరీస్ లో ముంబై ఎమర్జింగ్ జట్టు తరపున ఆడుతూ  ఇంగ్లాండ్ ఎమర్జింగ్ జట్టుపై వరుసగా మూడు మ్యాచ్ ల్లో సెంచరీలు చేయడం విశేషం. వరుసగా రెండు మ్యాచ్ ల్లో శతాకాలు బాదిన ఈ ముంబై కుర్రాడు.. తాజాగా లఫ్బురుపై జరిగిన మ్యాచ్ ల్లో 146 బంతుల్లో 154 పరుగులు చేశాడు. ముషీర్ ఇన్నింగ్స్ లో 22 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.సూర్యాంష్ కేవలం 64 బంతుల్లో 108 పరుగులు చేయడంతో ఎంసిసి జట్టు ఈ మ్యాచ్ లో 60 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 384 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

అంతకముందు కంబైన్డ్ నేషనల్ కౌంటీస్ XI తో జరిగిన మ్యాచ్ (జూలై 3)లో, ముషీర్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో 127 బంతుల్లో 125 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. నాటింగ్ హామ్ షైర్ 2వ XI తో జరిగిన మొదటి మ్యాచ్ లో మ్యాచ్ లోనూ 127 బంతుల్లో 123 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్ లో కూడా అద్భుతంగా రాణించిన ముషీర్ 3 మ్యాచ్ ల్లోనే 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

కొన్ని వారాల క్రితం జరిగిన ముంబై టీ20 లీగ్‌లో ముషీర్ విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 16.50 యావరేజ్ తో కేవలం  66 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఇంగ్లీష్ పరిస్థితులకు మారడం.. టెస్ట్ ఫార్మాట్ కావడంతో తన ఆటతో మరోసారి ఆకట్టుకున్నాడు. 2024 సెప్టెంబర్ లో ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. ముషీర్ తన తండ్రి నౌషాద్‌తో కలిసి కాన్పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఇరానీ కప్ మ్యాచ్‌తో పాటు.. రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. 

సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిగా క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చి దేశవాళీ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. ఇటీవలే దులీప్ ట్రోఫీలో ఇండియా బి  తరపున ఇండియా ఏ పై 181 పరుగులు చేశాడు. అయితే చివరి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను రెండు సార్లు డకౌటయ్యాడు. ముషీర్ టెస్ట్ ఫార్మాట్ లో 15 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 716 పరుగులు చేశాడు. శ్రీలంక వేదికగా జరిగిన 2024 అండర్ 19 వరల్డ్ కప్ లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.