స్టేట్ కాంగ్రెస్ పార్టీకి ‘ముస్లిం లీగ్ కాంగ్రెస్’ పేరు కరెక్ట్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

స్టేట్ కాంగ్రెస్ పార్టీకి ‘ముస్లిం లీగ్ కాంగ్రెస్’  పేరు కరెక్ట్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     ముస్లింలకు 14% రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు అన్యాయం చేసినట్లే 
  •     ‌‌‌‌కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్

న్యూఢిల్లీ/షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్  పార్టీకి ‘ముస్లిం లీగ్ కాంగ్రెస్  పార్టీ’ పేరు చక్కగా సరిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు  శాశ్వతంగా కల్పించేలా అవసరమైన పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని అన్నారు. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ అమలు చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డి ప్రకటన రిలీజ్  చేశారు. 

2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ  150 సీట్లలో 50 సీట్లను బీసీలకు రిజర్వ్  చేశారని గుర్తు చేశారు. వీటిలో 62% సీట్లు ఎంఐఎం కైవసం చేసుకుందన్నారు. ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్ల ఆధారంగా 4 శాతం, బీసీల్లో ముస్లింలను చేర్చడం ద్వారా మరో 10 శాతం రిజర్వేషన్లను జోడించి మొత్తం 14% రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  

కుల సర్వే ముసుగులో బీసీ జనాభాను తగ్గించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈ లెక్కల పేరుతో బీసీలు, ముస్లింలకు కలిపి... వారికి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కేటాయించారని విమర్శించారు. దీంతో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం కోటా 32కి తగ్గుతుందని వ్యాఖ్యానించారు.తెలంగాణ వెనుకబాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్  పార్టీయే అని కిషన్ రెడ్డి అన్నారు. మున్సిపల్  ఎన్నికల్లో భాగంగా శుక్రవారం షాద్ నగర్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. 

కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలె

ఆమనగల్లు, వెలుగు: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌కు మున్సిపల్‌‌ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పాలని కిషన్‌‌రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. అవి రెండు తోడు దొంగల పార్టీలని విమర్శించారు.