హైదరాబాద్ లో ముస్లింలు ఏర్పాటు చేసిన గణేష్ మండపం.. రోజూ పూజలు

హైదరాబాద్ లో ముస్లింలు ఏర్పాటు చేసిన గణేష్ మండపం.. రోజూ పూజలు

హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని పెంపొందించేలా ఓ ముస్లిం వ్యక్తి గణేష్‌ మండపాన్ని ఏర్పాటు చేశాడు. రామ్‌నగర్‌లో మహ్మద్ సిద్ధిక్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. తన హిందూ స్నేహితులతో కలిసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మహ్మద్ సిద్ధిక్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని హిందువులతో పాటు..ముస్లింలు సందర్శించి పూజలు చేస్తున్నారు. 

సెప్టెంబర్ 18వ తేదీన వినాయక చవితి రోజున భారీ గణేష్ విగ్రహాన్ని  మహ్మద్ సిద్దిక్ తన హిందూ స్నేహితులతో కలిసి కొనుగోలు చేశాడు. అప్పటికే రామ్ నగర్ లో సర్వాంగసుందరంగా వినాయక మండపాన్ని ముస్తాబు చేశారు. అనంతరం భారీ వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించారు. గత ఐదు రోజులుగా ఈ రాంనగర్ లో మహ్మద్ సిద్దిక్ ఏర్పాటు చేసిన గణేషుడి విగ్రహం పూజలందుకుంటోంది. ఈ పూజల్లో స్థానికంగా ఉండే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పాల్గొంటూ..  మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. 

Also Read :- పోలీస్ అలర్ట్ : గణేష్ నిమజ్జనం రోజు పాటించాల్సిన నిబంధనలు

18 ఏండ్లుగా ఏర్పాటు..

తాము ప్రతీ ఏడాది రాంనగర్ లో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మండపం నిర్వాహకులు మహ్మద్ సిద్ధిక్ తెలిపాడు. గత 18 ఏండ్లుగా తన హిందూ స్నేహితులతో కలిసి ఈ  వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పాడు. వినాయక విగ్రహం ఏర్పాటు దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తామన్నాడు. 9 రోజుల పాటు..మండపం దగ్గర పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పాడు. 

తన స్నేహితులతో కలిసి తాను గణేష్ వేడుకల్లో పాల్గొంటానని..వారంతా రంజాన్ వేడుకల్లో పాల్గొంటారని మహ్మద్ సిద్ధిక్ తెలిపాడు. గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి హిందూ స్నేహితులు విరాళాలు ఇస్తారని చెప్పాడు. రంజాన్ సమయంలో వారంతా తమకు ఇఫ్తార్ ఇచ్చి పండుగ నిర్వహించుకుంటామన్నారు. ఏ మతం అయినా..తామంతా అన్నదమ్ముళ్ల వలె కలిసి ఉంటామని...మతాలకు అతీతంతా అన్ని పండగలు కలిసి జరుపుకుంటామని మహ్మద్ సిద్ధిక్ వెల్లడించాడు.