సాఫ్ చేసేయ్! టికెట్ కొట్టేయ్

సాఫ్ చేసేయ్! టికెట్ కొట్టేయ్

జనగామ, వెలుగు మున్సిపల్ టికెట్ కావాల్నా.. అయితే సైడ్​ డ్రైన్​లు సాఫ్​జెయ్యాలె.. రోడ్లు ఊడ్వాలె.. చెత్త ఎత్తి పొయ్యాలె.. స్వచ్ఛ వార్డులుగా మార్చాలే.. గట్లయితెనే  మీ పనితీరు ఏందో జనానికి తెలుస్తది.. నాలుగు ఓట్లు పడి గెలుస్తరు.. అందుకే మీకు గీ పోటీ పెడుతున్న.. వెంటనే షురూ జేయిన్రి..’ రాబోయే మున్సిపల్​ ఎన్నికల్లో ఆశావహులకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇచ్చిన టాస్క్​ ఇది. రాత్రి ఎమ్మెల్యే సాబ్​ గిట్లన్నడో లేడో పొద్దుగాల్నే లోకల్​ లీడర్లంతా పనిలో దిగిపోయినరు.

మొత్తం 30 వార్డులు…

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి త్వరలో జరుగనున్న మున్సిపల్​ ఎన్నికల్లో  టికెట్లు ఇచ్చేందుకు కొత్త మెథడ్​ ఎంచుకున్నారు. పైరవీలకు నో చాన్స్​ అని.. పారిశుద్ధ్య పనులే ప్రామాణికమని తేల్చేశారు.
ఆశావహులను పరుగులు పెట్టిస్తున్నారు.  జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ జనగామే. ఇక్కడ గతంలో 28 వార్డులు ఉండేవి. వార్డుల పెంపుతో సంఖ్య 30కి చేరింది. ఈ మధ్య కాలంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్​లో  చేరిన లీడర్లతో టికెట్లకు పోటీ విపరీతంగా ఉంది. నేనంటే నేను అని కుస్తీ పడుతున్నారు. రిజర్వేషన్ల ప్రకటన రాక ముందే ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వార్డుల వారీగా ఓటరు జాబితా గతంలోనే విడుదల కాగా,  ఏ వార్డులో ఏ రిజర్వేషన్​ వస్తుందనే అంచనాకు లీడర్లు వచ్చారు. దీంతో ఎన్నికల హీట్​ పెరిగింది. దీనంతటికీ ఒకే మందు పెట్టాలన్నట్లుగా ఎమ్మెల్యే కొత్త మెలిక పెట్టేశారు. పారిశుద్ధ్య పోటీ తో జనగామ శుద్ధిగా మారడంతో పాటు పట్టణ ప్రజల్లో గులాబీ దండు పై సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది ఆయన ఆలోచనగా భావిస్తున్నారు.

మెజార్టీ సాధించేందుకే…

గత ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కు చుక్కలు చూపించి.. కేవలం ఆరు వార్డు స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్​ఇతర పార్టీల సాయంతో మున్సిపల్​ పీఠాన్ని దక్కించుకుంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మార్క్​ రాజకీయంతో గతంలో కుర్చీ సొంతమైంది. కానీ ఈసారి మాత్రం స్పష్టమైన మెజారిటీ తో పుర పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే ముందస్తు ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్​ నాటికి గెలుపు గుర్రాల జాబితా రెడీ చేయడమే లక్ష్యంగా కదులుతున్నారు. కాగా, ఈ పోటీలో టికెట్​ ఎవరికి దక్కుతుందో తేలాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే.