
Mutual Funds: భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ప్రజల్లో సాంప్రదాయ పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి కొత్త సాధనాల్లో పెట్టుబడిపై అవగాహన పెరగటం.. పైగా ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి కంటే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తక్కువగా ఉండటం చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షించింది.
ప్రస్తుతం దేశంలోని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్న మెుత్తం ఆస్తుల విలువ రూ.74.40 లక్షల కోట్లకు చేరుకుంది. వాస్తవానికి గడచిన 10 ఏళ్ల కాలంలో ఇది ఏడు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న అవగాహన, నమ్మకాన్ని సూచిస్తుందని మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెబుతున్నాయి. వీటిలో దాదాపు 60 శాతం డబ్బు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ వద్ద ఉండగా.. 26.53 శాతం డబ్బు డెట్ ఫండ్స్, కేవలం 8 శాతం మాత్రం హైబ్రిడ్ ఫండ్స్ కింద మిగిలినవి ఇతర ఫండ్స్ కేటగిరీలో పార్క్ చేయబడ్డాయని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది.
పెట్టుబడిదారుల్లో ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ధోరణి పెరగటమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ ఖర్చులు, పెరిగిన ట్రాన్స్పరెన్సీ, సెబీ నియంత్రణ వంటివి కలిసొస్తున్నాయి. జూన్ 2025లో కొత్త పెట్టుబడులు రూ.3లక్షల 98వేల కోట్లుగా నిలిచింది. ఇందులో యాక్టివ్ ఫండ్స్ కి రూ.3లక్షల 62వేల కోట్లు వెళ్లినట్లు వెల్లడైంది. ప్రధానంగా ఇన్వెస్టర్లు తమ డబ్బును ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కేటగిరీల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుండగా.. లార్జ్ క్యాప్ ఇప్పటికీ ఇన్వెస్టర్ల బెస్ట్ ఛాయిస్ గా నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. ఇక థీమ్యాటిక్ ఫండ్స్ ఎక్కువగా విత్ డ్రాలను చూస్తున్నాయి.