టీచర్ల మధ్య ‘మ్యూచువల్’ పంచాది

టీచర్ల మధ్య ‘మ్యూచువల్’ పంచాది
  • జీరో సర్వీస్​కు ఒప్పుకుంటూ డిక్లరేషన్ ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు
  • దీంతో డ్రాప్ అవుతామని చెబుతున్న టీచర్లు, ఉద్యోగులు 
  • ఇప్పటికే పరస్పర బదిలీల కోసం కుదిరిన బేరాలు  
  • డబ్బులు ఇచ్చినోళ్లు, తీసుకున్నోళ్ల మధ్య గొడవలు
  • హైకోర్టు తీర్పు రాకుండానే సర్కార్ ఆదేశాలు ఇవ్వడంతో గందరగోళం 


హైదరాబాద్ : రాష్ట్ర సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లు చేయకుండా కొత్త జోన్లు, జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఉద్యోగులు ఆందోళనలు చేయడంతో మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లను తెరపైకి తెచ్చింది. ఈ బదిలీలకు సంబంధించి సర్వీస్ ప్రొటెక్షన్ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. కానీ తీర్పు రాకముందే డిక్లరేషన్ ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తుది తీర్పునకు లోబడి జీరో సర్వీస్​కు ఒప్పుకునేటోళ్లు వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం ఆదేశాలు జారీ చేశారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే బదిలీకి ఇష్టం లేనట్టుగానే భావిస్తామని అందులో  పేర్కొన్నారు. పైగా ఇందుకు ఒక్క రోజే టైమ్ ఇచ్చారు. సర్కార్ ఆదేశాలతో మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లకు ఒప్పుకున్న టీచర్లు, ఉద్యోగుల మధ్య గొడవలు మొదలయ్యాయి. 

సర్కార్ ఆదేశాలతోనే గొడవలు
మ్యూచువల్ బదిలీల కోసం బహిరంగంగానే భారీగా డబ్బులు చేతులు మారాయి. ప్రధానంగా ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్లు గ్రేటర్ చుట్టుపక్కల జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కోసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇచ్చి మరీ మ్యూచువల్​కు పార్టనర్​ను వెతుక్కున్నారు. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్​లో కొత్త జిల్లాలకు వెళ్తే ఇప్పటిదాకా చేసిన సర్వీస్ ఉండదనడంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఇప్పటికే డబ్బులు అడ్వాన్స్​గా ఇచ్చిన వారంతా వెనక్కి ఇవ్వాలని కోరుతుండగా, కొందరు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

టీచర్ల నుంచి 2,895 దరఖాస్తులు.. 
ఉద్యోగుల ఆందోళనతో సర్కార్​ మ్యూచువల్ బదిలీలకు అనుమతి ఇవ్వడంతో మార్చి నెలాఖరు వరకు టీచర్ల నుంచి 2,895 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పటికే టీచర్ల కేటాయింపు పూర్తి కాగా కొత్త జిల్లాల్లో సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు రాకముందే విద్యాశాఖ డిక్లరేషన్ తీసుకోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. చాలామంది సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందనే భావనతోనే మ్యూచువల్ బదిలీలకు రెడీ అయ్యారని, అది ఉండదంటే చాలామంది డ్రాప్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఏండ్ల సర్వీస్​ను ఎవరూ వదులుకోరని టీచర్ల సంఘాల నేతలు చెబుతున్నారు.

సెక్రటేరియేట్​లో పని చేసే ఓ అధికారి భార్య నిజామాబాద్ నుంచి రంగారెడ్డికి వచ్చేందుకు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ కోసం అప్లై చేసుకున్నారు. ఇందుకోసం మరో ఉద్యోగితో రూ.12 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. ఇప్పటికే సగం డబ్బులు ఇచ్చారు. అయితే సర్వీస్ ప్రొటెక్షన్ పై క్లారిటీ లేకపోవడంతో తాను విల్లింగ్ ఇవ్వనని ఆయన చెప్పారు. దీంతో ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని కోరగా, తన వద్ద లేవని ఖర్చయిపోయాయని తెలిపారు. కొంతమందితో అడిగిపిస్తే, ఉన్నప్పుడు ఇస్తానని దాటవేశారు. 

మరిన్ని వార్తల కోసం : -
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల తాగునీటి కష్టాలు


వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం