ముంబై: టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో భాగంగానే 2026, మార్చి 8న తన ప్రియురాలు, నటి అకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
‘‘మైదానంలో సిక్సర్ల నుంచి జీవితాంతం హిట్ల వరకు.. ఆమె నా పరిపూర్ణ ఇన్నింగ్స్’’ అనే క్యాప్షన్‌తో ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో పృథ్వీ షా మోకాళ్లపై కూర్చొని తన ప్రియురాలి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతున్నాడు. నిశ్చితార్థం చేసుకున్న పృథ్వీ షా జోడికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
ఎవరీ అకృతి అగర్వాల్..?
అకృతి అగర్వాల్‌తో క్రికెటర్ పృథ్వీ షా నిశ్చితార్థం జరగడంతో అసలు ఎవరీ ఈ అమ్మాయి అని నెటిజన్లు శోధిస్తున్నారు. అకృతి అగర్వాల్ 2003, మే 2న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించింది. చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ముంబైలోని నిర్మలా మెమోరియల్ ఫౌండేషన్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డిగ్రీని పూర్తి చేసింది.
కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో డ్యాన్స్, లిప్ సింక్ వీడియోలు ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటుయూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడుపుతుంది అకృతి.
అంతేకాకుండా త్రిముఖ అనే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంతో అకృతి సినీ రంగ ప్రవేశం చేయబోతుంది. గతంలో చాలా సార్లు అకృతి, పృథ్వీ షా బహిరంగంగా కెమెరాలకు చిక్కారు. దీంతో అకృతి పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్ అంటూ రూమర్స్ వినిపించాయి. ఇటీవల జరిగిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి కూడా వీరిద్దరూ కలిసే హాజరయ్యారు.
పడుతూ లేస్తూ..!
ఆరేండ్ల కిందట అండర్19 వరల్డ్ కప్ నెగ్గిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకొని ఇండియా క్రికెట్లో సచిన్ టెండూల్కర్‌తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని అనుకున్న పృథ్వీ షా కెరీర్‌పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యింది. ఇందుకు ప్రధాన కారణం అతడి వైఖరే.
అధిక బరువు, గాయాలు, ఫామ్ కోల్పోవడం, వ్యక్తిగత విభేదాలు ఇవ్వన్నీ పృథ్వీ కెరీర్‌ను పక్కదారి పట్టించాయి. చిన్న వయసులోనే వచ్చిన స్టార్‌డమ్ అతనిపై ప్రతికూల ప్రభావం చూపింది. చివరకు జ్ఞానోదయం కావడంతో మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు.
తనకు ప్రధాన సమస్య అయిన అధిక బరువుపై ఫోకస్ పెట్టి భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. ఇండియా టీములో స్థానం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇటీవల జరిగిన రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ 2026 ఐపీఎల్ మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. కానీ చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కనీస ధరకు కొనుగోలు చేసి తనను తాను నిరూపించుకోవడానికి మరో అవకాశం కల్పించింది.
