లండన్‌లోని ఎంబసీకి మయన్మార్ తాళం

లండన్‌లోని ఎంబసీకి మయన్మార్ తాళం
  • ఆర్మీ జుంటా తీరును ఖండించిన బ్రిటన్

లండన్: మయన్మార్ ఆర్మీ జుంటా (మిలిటరీ సర్కార్) లండన్ లోని ఎంబసీని లాక్ చేయడాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. బ్రిటన్ లో మయన్మార్ అంబాసిడర్ క్యా జ్వార్ మిన్ ను ఎంబసీలోకి అనుమతించకుండా ఆర్మీ జుంటా బెదిరింపు చర్యలకు దిగుతోందని తప్పుపట్టింది. మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని మిలిటరీ కూలదోయడాన్ని మిన్ మొదటి నుంచీ విమర్శించారు. సూకీ, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ ప్రభుత్వం లండన్ లోని ఎంబసీని బుధవారం తమ కంట్రోల్ లోకి తీసుకుంది. మిన్ ను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన రాత్రంతా రోడ్డుపై కారులోనే గడిపారు. అంబాసిడర్ సహా ఆఫీస్ స్టాఫ్ ను లోపలికి రాకుండా ఆపాలంటూ లోకల్ పోలీసులకు మయన్మార్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది. దీంతో ఎంబసీ వద్దకు చేరుకున్న చాలా మంది నిరసనలు తెలిపారు. మిన్ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ అన్నారు. అయితే మయన్మార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అంగీకరించాల్సిందేనని తమకు లెటర్ అందినట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.