కేసులు పెట్టినా తగ్గేదేలే .. బీఆర్ఎస్కు మైనంపల్లి వార్నింగ్

కేసులు పెట్టినా తగ్గేదేలే .. బీఆర్ఎస్కు మైనంపల్లి వార్నింగ్

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని..వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవదన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. తాను కాంగ్రెస్ చేరిన తర్వాత తన అనుచరులపై  అక్రమ కేసులు బనాయించి  వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే తన అనుచరులపై అక్రమ కేసులు ఆపకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ తమపై రోజుకు వందల కేసులు పెట్టినా.. వెనక్కి తగ్గేది లేదన్నారు.  

కేసీఆర్ సర్కారు  మీడియాను కూడా ఇబ్బందులకు గురి చేస్తోందని మైనంపల్లి హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ కు మరోసారి అధికారం ఇస్తే  తెలంగాణలో బ్రిటిష్ పాలన చూడబోతామని ప్రజలను హెచ్చరించారు. రాబోయే  ఎలక్షన్లలో తెలంగాణలో సైలెంట్ ఓటింగ్ జరగనున్నదని.. ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మైనంపల్లి కోరారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మైనంపల్లి హనుమంత రావుకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హనుమంత్ అన్నా జిందాబాద్ అనే నినాదాలతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మైనంపల్లి అనుచరులు కార్లలో బయలుదేరగా..వారిని  శంషాబాద్- బెంగళూర్ జాతీయ రహదారిపై  పోలీసులు అడ్డగించారు. పోలీసులను నుంచి కార్యకర్తలు, అభిమానులు తప్పించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలివచ్చి మైనంపల్లికి స్వాగతం పలికారు.