మిస్టరీగా దళిత బాలిక మృతి

మిస్టరీగా దళిత బాలిక మృతి
  • హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ
  • పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన
  • న్యాయం కోసం దళిత సంఘాల ఆందోళన
  • కేసు సమగ్ర విచారణకు  డీఐజీ ఏవీ రంగనాథ్ ఆదేశాలు

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ఓ దళిత బాలిక(17) మృతి మిస్టరీగా మారింది. ఈ నెల 13న వెలుగులోకి వచ్చిన ఈ కేసును పోలీసులు కావాలనే నీరుగారుస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. బాలిక మృతిచెంది నాలుగు రోజులు గడుస్తున్నా ఆమె ఎలా చనిపోయిందో పోలీసులు ఇంతవరకు తేల్చలేదు. వివరాల్లోకి వెళ్తే..  కొప్పోలు గ్రామానికి చెందిన ఓ బాలిక (17) నల్గొండలోని ఓ ప్రైవేట్​ కాలేజీలో ఓకేషనల్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే ఎస్సీ హాస్టల్లో ఉంటున్న బాలిక, ఘటన జరగడానికి మూడు రోజులు ముందు కొప్పోలు వచ్చింది. ఈ నెల12న తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నిద్రపోయిన బాలిక, అర్ధరాత్రి తర్వాత కనిపించలేదు. 13న ఉదయం 7గంటలకు కొప్పోలు శివారులోని రైసు మిల్లు వెనక వ్యవసాయ భూమిలో బాలిక మృతదేహం కనిపించింది. ఆమె మెడ చుట్టూ చున్నీ బిగించి లాగిన ఆనవాళ్లను గ్రామస్తులు గుర్తించారు.  ఘటనా స్థలం వద్ద బీరు సీసా ముక్కలు పడి ఉన్నాయి. దీంతో బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్నాళ్లుగా  వెంటపడుతున్న అదే గ్రామానికి చెందిన పవన్(20)పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఎస్సై తీరుపై ఆందోళన 
కేసు విషయంలో స్థానిక ఎస్సై రామకృష్ణ వ్యవహారశైలిపై దళిత సంఘాలు ఇప్పటికే పలుసార్లు ఆందోళనకు దిగాయి. బాలిక హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు.  స్థలం వద్ద ఆనవాళ్లు సేకరించలేదని, పగిలిన బీరు సీసా ముక్కలు,  బాలిక మెడకు బిగుసుకున్న చున్నీ, తలపై గాయం, చెవి నుంచి రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కేసును పక్కదోవ పట్టించారని ఆరోపించారు. పవన్​తో పాటు మరికొందరు నిందితులపై పోక్సో కింద కేసు పెట్టాలనే విషయం కూడా పట్టించుకోలేదని ప్రతిపక్షాల లీడర్లు అంటున్నారు.

కేతేపల్లిలో ధర్నా
కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తున్నారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ స్టేట్ చైర్మన్ ప్రీతమ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన పీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్యతో కలిసి కొప్పోలు గ్రామంలో పర్యటించారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఎస్సైని సస్పెండ్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ నాయకులు పాలడగు నాగార్జున, ప్రజాపోరాట సమితి నాయకులు నూనె వెంకటస్వామి డిమాండ్​ చేశారు. కేతేపల్లిలో ధర్నా చేసిన అనంతరం ఎస్సై దిష్టిబొమ్మ దహనం చేశారు.  బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. 

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నం
కేసు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం. అడిషనల్ ఎస్పీని ప్రత్యేక అధికారిగా నియమించాం. పవన్​తో పాటు మరికొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ఘటన జరిగిన రోజు కొన్ని ఎవిడెన్స్ గుర్తించలేదు. దీంతో సెక్షన్ 174 కింద కేసు పెట్టాం. ఇప్పుడు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.
- డీఐజీ ఏవీ రంగనాథ్, నల్గొండ జిల్లా