హైదరాబాద్, వెలుగు: డిటెక్టివ్.. ఈ పేరుని, క్యారెక్టర్‌ని చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఒక టాస్క్‌ని విభిన్న కోణాల్లో పరిశోధించి పరిష్కారం చూపిస్తుంటాడు డిటెక్టివ్. నల్ల కోటు, చేతిలో భూతద్దంతో ఉండే ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టపడుతుంటాం. ఇప్పుడు మీరు కూడా డిటెక్టివ్‌లా మారొచ్చు. సిటీలోని మిస్టరీ రూమ్స్ సిటిజన్లకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. డిటెక్టివ్ ఎలా ఆలోచిస్తాడో అలాంటి థీమ్‌లతో సరికొత్తగా గేమ్‌లను డిజైన్ చేసి వివిధ టాస్క్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మిస్టరీ రూమ్స్, డిటెక్టివ్ స్ట్రీట్స్ సిటీలో నయా హ్యాంగౌట్ ప్లేసెస్‌గా మారుతున్నాయి. సిటిజన్లు వీక్ డేస్, వీకెండ్స్ లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్తూ వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందుతున్నారు. లిమిటెడ్ టైంలో టాస్క్‌లను కంప్లీట్‌చేసి డిటెక్టివ్ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఉత్కంఠ కలిగించేలా..
సిటీలో ఎన్నో రకాల గేమింగ్ జోన్స్ ఉన్నాయి. వాటన్నింటికి భిన్నంగా ఈ మిస్టరీ రూమ్‌లను తీర్చిదిద్దారు నిర్వాహకులు. అడ్వెంచరస్, థ్రిల్లింగ్ గేమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునేవారికి ఈ ఎస్కేప్, మిస్టరీ రూమ్స్ లో ఉండే పలు రకాల గేమ్స్ నయా అనుభూతినిస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ గేమింగ్‌జోన్ లు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్‌లుగా, ఫ్యామిలీతో వెళ్లి టాస్క్‌లను ఫినిష్ చేసేలా ఉన్న ఈ గేమ్‌ల ప్యాకేజీలు రూ.700 నుంచి వెయ్యి వరకు ఉన్నాయి. పార్టిసిపేట్చేసేవారు మొబైల్స్, వాలెట్స్, ఆక్సెసరీస్ అన్నీ లాకర్స్ లో పెట్టుకుని గేమ్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది.
మిస్టరీస్ ని ఛేదిస్తూ..
ది హర్ట్ లాకర్, లాక్ అవుట్, క్యాబిన్ ఇన్ ది వుడ్స్, ది కోన్ ఆఫ్ కోహినూర్ వంటి పేర్లతో గేమ్స్ ఉంటున్నాయి. ఒక రూమ్‌లో లాక్ అయిపోయినప్పుడు అందులో నుంచి ఎలా బయటపడతారు? గంట సమయంలో సమస్యను ఎలా సాల్వ్ చేస్తారు? లాంటి కాన్సెప్ట్‌లతో ఛాలెంజ్‌లు ఉంటున్నాయి. పాల్గొనేవారికి నిర్వాహకులు కొన్ని క్లూస్‌లు ఇస్తుంటారు. వాటి ఆధారంగా గంట సమయంలో టాస్క్ ని పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ మిస్టరీ, ఎస్కేప్ రూమ్స్ కి ప్రస్తుతం సిటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. వీకెండ్స్ లో రద్దీగా ఉన్నా వెయిట్ చేసి మరీ ఈ గేమ్‌లను ఆడేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని చోట్ల నేరుగా వెళ్లే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల కచ్చితంగా ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్లాల్సిందే.
ఆలోచనా శక్తి పెరుగుతుంది
జనాలు ఈ గేమ్‌లు ఆడుతూ ఎంజాయ్‌చేస్తున్నారు. వారు ఆడేటప్పుడు మేం గేమ్ జోన్ లోకి వెళ్లం. కెమెరాల్లో చూస్తూ బయటి నుంచే వారికి ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. త్వరగా టాస్క్ కంప్లీట్ చేయాలని క్లూస్ కోసం వారు పరుగులు పెడుతుంటారు. ఈ గేమ్స్ ల వల్ల థ్రిల్ పొందడంతో పాటు ఆలోచనాశక్తి కూడా పెరుగుతుంది. కొవిడ్ తర్వాత జనాలకు వీటిపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఎక్కువగా బుకింగ్స్ వస్తున్నాయి.
–మెహబూబ్, రీజనల్ మేనేజర్, మిస్టరీ రూమ్స్, హైదరాబాద్
క్లూస్‌తో కంప్లీట్ చేశాం..
మొదటిసారి మిస్టరీ రూమ్స్ కి ఫ్రెండ్స్ తో కలిగి వెళ్లాను. స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా, కోపరేటివ్‌గా ఉన్నారు. కంజ్యూరింగ్ రూమ్ టాస్క్ తీసుకున్నాం. డిఫికల్ట్ గా ఉన్నా క్లూస్ వల్ల ఫుల్ ఫన్ తో కంప్లీట్ చేశాం.
–సాత్విక, డిగ్రీ స్టూడెంట్, మాదాపూర్
