వెంకీమామ టైమింగ్ అందుకోవడం చాలా కష్టం

వెంకీమామ టైమింగ్ అందుకోవడం చాలా కష్టం

తండ్రితో కలిసి ‘మనం’తో హిట్టందుకున్న నాగచైతన్య.. ఇప్పుడు మేనమామ వెంకటేష్‌ తో కలిసి నటించాడు. మరో మామ సురేష్ బాబు నిర్మించిన ‘వెంకీమామ’ గురించి మేనల్లుడు చెప్పిన ముచ్చట్లు .

ఈ సినిమాకి తెరపై ఓ మావయ్య, తెరవెనుక ఓ మావయ్య నాకు సపోర్ట్ చేశారు. మేకింగ్‌‌కి సంబంధించి సురేష్ మావయ్య నుండి కొన్ని నేర్చుకున్నాను. నటనలో వెంకీమామ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. వెంకటేష్ గారిని ద్వేషించే వాళ్లు ఉండరంటారు. సెట్‌‌లో ఆయన ప్రవర్తన చూశాక అలా ఎందుకంటారో అర్థమైంది.

నేను, మావయ్య ఎక్కువగా మాట్లాడుకోం. అయితే మా మధ్య ఓ బాండింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో చాలా డైలాగులు, హై ఎమోషన్స్ ఉన్నాయి. వాటికి అలవాటు పడటానికి ఓ వారం పట్టింది. రెండు పాత్రల మధ్య రియల్ బాండింగ్ ఉందని ప్రేక్షకులు ఫీలవుతారు. ఈ స్క్రిప్ట్‌‌కి అది బోనస్.

నేను నటన ప్రారంభించిన నాటినుండే వెంకీమామతో కలిసి నటించాలని, సురేష్ ప్రొడక్షన్స్‌‌లో సినిమా చేయాలని ఆశ ఉండేది. కానీ ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. అనుకోకుండా ఈ సినిమాకి ఆ రెండూ కలిసొచ్చాయి.  వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ సినిమాతో నాకూ ఆ స్పాన్ పెరుగుతుందని భావిస్తున్నాను.

భీమవరంలో మొదలై కశ్మీర్ లో ముగిసే కథ ఇది. నాకు కెరీర్‌‌‌‌కి బెస్ట్ మూవీ ఇవ్వాలని బాబీతో కలసి మావయ్యలిద్దరూ ఈ స్టోరీని చాలా  బాగా డిజైన్ చేశారు. సర్జికల్‌‌ స్ట్రైక్‌‌ యాక్షన్‌‌ ఎపిసోడ్‌‌ని నా పాత్ర కోసం జత చేశారు. ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రలన్నింటిలో మోస్ట్ చాలెంజింగ్ రోల్ ఇది. నా కెరీర్‌‌కి ఈ సినిమా తప్పకుండా పెద్ద ప్లస్‌‌ అవుతుంది.

వెంకటేష్‌‌గారి కామెడీ టైమింగ్‌‌ని అందుకోవడం చాలా కష్టమైంది. నవ్వు ఆపుకోలేక చాలా టేక్స్‌‌ తీసుకున్నాను. ట్రైలర్‌‌లో చూసిన వినోదం కొంతే. సినిమాలో ఫుల్ లెంగ్త్ ఎంజాయ్ చేస్తారు. ఎమోషనల్‌‌ సీన్లలో వెంకీ మామ ఎక్స్‌‌ప్రెషన్స్‌‌, కామెడీ టైమింగ్స్ ఆయనతో కలిసి నటించే వారికి ప్లస్ అవుతాయి.

సినిమాలో కావాల్సినంత వినోదంతో పాటు మామాఅల్లుళ్ల మధ్య లెక్కలేనంత ప్రేమ, అంచనా వేయలేనంత త్యాగం ఉంటాయి. ఇటీవల అలాంటివి తెరమీద చూడలేదు. రియల్‌‌ లైఫ్‌‌ మామ, అల్లుడు ఆ పాత్రల్ని పోషించడం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. నా పాత్రని ప్రేక్షకులు అంగీకరిస్తే ఆ క్రెడిట్ అంతా సురేష్, వెంకటేష్ మామలతో పాటు బాబీకి దక్కుతుంది.

‘మనం’లో రాశీఖన్నాది కేవలం రెండు నిముషాల పాత్ర. అప్పటికీ ఇప్పటికీ తను నటన విషయంలో చాలా పరిణతి సాధించింది. తను నటించిన ‘తొలిప్రేమ’ నా ఫేవరేట్ మూవీ. ఇందులోనూ అద్భుతంగా నటించింది.

నా సినిమాలను సమంత క్లోజ్‌‌గా అబ్జర్వ్ చేస్తుంది. నచ్చినా, నచ్చకున్నా నిజాయతీగా చెబుతుంది. అలా చెప్పడమే నాక్కూడా ఇష్టం. ఈ సినిమా కథ మాత్రం తనకి తెలియదు. ఈ మధ్యనే సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది.

నాన్న, వెంకటేష్ మామ రిస్క్ అనిపించిన విషయాల్లో కూడా చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారు. అయితే వాళ్లిద్దరి టైమింగ్, మీటర్ చాలా డిఫరెంట్. అందుకే ఇద్దరి సినిమాలు పూర్తి భిన్నంగా ఉంటాయి.  నాకైతే నటుడిగా రియలిస్టిక్‌‌ స్టోరీలు, క్యారెక్టర్స్‌‌ అంటే ఇష్టం. కానీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కమర్షియల్ సినిమాల్లోనూ నటించాలి కదా. అందుకే ప్రస్తుతానికి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను.