నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో కుమ్మెర ఘటనపై ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దేవాలయ పూజారి పెద్ద సాయిలు యాదవ్ సాక్ష్యం ప్రకారం... చిలకేశ్వర మౌనిక, చంద్రకళ అలియాస్ చాకలి కర్రెమ్మ, భౌరమ్మ కుమ్మెర మల్లన్న దర్శనం కోసం వచ్చిన టైంలో రద్దీ ఎక్కువగా ఉందని.. ఆ సమయంలో వారు బారికేడ్ దాటటానికి ప్రయత్నించారని.. క్యూ లైన్ లో వెళ్లమని చెప్పినందుకు తన బావ కొడుకు గణేశ్ కు ఫోన్ చేసి పిలిచిందని తెలిపారు.
భౌరమ్మ బావ కొడుకు చాకలి గణేష్ కుమ్మెర గ్రామం వార్తలు అనే వాట్సప్ గ్రూప్ లో శ్రీనివాస్ రెడ్డి గురించి అశ్లీల ఆడియో పోస్ట్ చేయటంతో గణేశ్ ను శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించాడని తెలిపారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి మరికొంతమంది గణేశ్, చంద్రకళను కొట్టారని అన్నారు. దీంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో శ్రీనివాస్ రెడ్డి తలకు గాయమైనట్లు తెలిపారు.
ఫిబ్రవరి 18న గణేష్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో తన భార్య, పాపపై దాడి గురించి ప్రస్తావించలేదని.. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని తెలిపారు పోలీసులు. ఫిబ్రవరి 20న గణేశ్ అతని కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ కు వచ్చి పిటిషన్ ప్రోగ్రెస్ గురించి అడిగారని.. 21న మౌనిక తన రెండు నెలల శిశివు కదలటం లేదని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా... డాక్టర్లు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అని అదే రోజు ఉదయం 7.55 గంటలకు ప్రకటించినట్లు తెలిపారు.
హాస్పిటల్ రికార్డు ప్రకారం కుటుంబం మెడికో లీగల్ కేసు, పోస్ట్ మార్టంకు ఒప్పుకోలేదని..పాప తండ్రి గణేశ్ తల్లి మౌనిక రిజిస్టర్ లో సంతకాలు చేసారని తెలిపారు.పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం పాపకు లోపల బయట ఎలాంటి గాయాలు లేవని నిర్ధారణ అయ్యిందని..
ప్రిమెచ్యూర్ బేబీ తక్కువ బరువు తో (1.44కిలో) 31 వారాల్లో 21 డిసెంబర్ 2025 నాడు పుట్టిందని తెలిపారు. శ్వాసకోశ సమస్య వల్ల నిలోఫర్ లోని ఎన్.ఐ.సీ.యూలో 30 రోజుల పాటు చికిత్స అందించినట్లు తెలిపారు పోలీసులు.
ఫిబ్రవరి 22న మౌనిక తాను ఎస్సి అని మరో కంప్లైట్ ఇచ్చిందని... తనను శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయ ప్రవేశం కోసం వంద రూపాయలు అడిగి కులం పేరుతో దూషించాడని తిట్టడంతోపాటు కొట్టాడని ఆరోపించింది. తనను, తన భర్తను, తన పాపపై దాడి చేసారని, మధు రెడ్డి పాపను తన్నటం వల్ల పాప రెండు మీటర్ల దూరం పడి చనిపోయిందని పిర్యాదు చేసారు.
ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నాగర్ కర్నూల్ డీఎస్పీ విచారణ ప్రారంభించారు.ఈ కేసులో ముగ్గురు నిందితులు శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లను 23న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. మిగత ముగ్గురు పరారీలో ఉన్నారని... ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయని తెలిపారు. హిస్టోపథాలజీ, పిసెరా రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయని...
ఏ చిన్న సాక్ష్యం దొరికినా, గాయాల వల్ల పాప చనిపోయినట్లు తెలిస్తే కేసులో మర్డర్ సెక్షన్లు చేర్చి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
