గాయాలతో పాప చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడ్తాం: నాగర్ కర్నూల్ ఎస్పీ

గాయాలతో పాప చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడ్తాం: నాగర్ కర్నూల్ ఎస్పీ
  • నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశాం
  • హిస్టోపాథాలజీ, విస్రా రిపోర్టులు రావాల్సి ఉంది 
  • చిన్నారి మృతిపై మాకు సానుభూతి ఉంది 
  • కుమ్మెర ఘటనపై నాగర్​కర్నూల్​ ఎస్పీ వెల్లడి

నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా కుమ్మెర ఘటనలో గాయాల వల్ల పాప చనిపోయినట్లు తేలితే నిందితులపై మర్డర్​ కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్  పాటిల్  తెలిపారు. గురువారం ఆయన ఎస్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జాతరలో ఈనెల 18న ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు​చేసి రిమాండ్​కు పంపామని, పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఈనెల 18న మల్లన్న దర్శనం కోసం వచ్చిన చంద్రకళ అలియాస్  చాకలి కర్రెమ్మ, బౌరమ్మ బారికేడ్  దాటడానికి ప్రయత్నించారని అన్నారు. భక్తులు ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్ లో వెళ్లాలని వారికి చెప్పినట్టు ఆలయ పూజారి పెద్ద సాయిలు యాదవ్  వెల్లడించారని, చంద్రకళ తన బావ కొడుకు గణేశ్​కు ఫోన్​ చేసి విషయం చెప్పగా అతడు కుమ్మెర గ్రామ వాట్సాప్ గ్రూప్ లో శ్రీనివాస్ రెడ్డి గురించి అశ్లీల ఆడియో పోస్ట్ చేశారని ఎస్పీ వివరించారు. సాయంత్రం గణేశ్​ ఎదురుపడగా తనను, తన కుటుంబాన్ని ఎందుకు తిడుతున్నావని శ్రీనివాస్ రెడ్డి నిలదీశాడని, దాంతో తన ఇష్టమంటూ గణేశ్​ రాయితో శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశాడని, శ్రీనివాస్​ రెడ్డి తలకు గాయం కాగా అతనితో ఉన్న వ్యక్తులు గణేశ్, చంద్రకళను కొట్టారని ఎస్పీ వెల్లడించారు. అదే రోజు రాత్రి శ్రీను, మధు, సతీష్​ రెడ్డి, పవన్, కన్నీ, శ్రీకాంత్​రెడ్డి, నవీన్​ తనపైనా,తన తల్లిపైనా దాడి చేసి బూతులు తిట్టారని గణేశ్​ కంప్లైంట్​ చేశాడని తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో కేసులు నమోదు చేశామన్నారు. మౌనిక తన రెండు నెలల చిన్నారి కదలకపోవడంతో ఈనెల 21న ఉదయం నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిందని, పరీక్షించిన డాక్టర్లు పాప అప్పటికే చనిపోయినట్టు చెప్పారన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్​ ప్రకారం పాపకు లోపల, బయట ఎలాంటి గాయాలు లేవని నిర్ధారణ అయ్యిందన్నారు. ప్రిమేచ్యూర్  డెలివరీ బేబీ కావడంతో 1.44 కిలోల తక్కువ బరువుందని, 36 వారాల తర్వాత పుట్టాల్సిన బేబి 31 వారాల్లోనే డిసెంబర్​21న పుట్టిందన్నారు. పుట్టినప్పుడే శ్వాసకోశ సమస్య ఉండడం వల్ల హైదరాబాద్​ నిలోఫర్ ఆస్పత్రిలోని లోని ఎన్ఐసీయూలో నెల రోజుల పాటు చికిత్స అందించారన్నారు. 

కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు

ఈనెల 22న గణేశ్​ భార్య మౌనిక పోలీసులకు మరో కంప్లైంట్ ఇచ్చిందని, ఎస్సీ మహిళనైన తాను దర్శనానికి వెళ్తే శ్రీనివాస్​రెడ్డి ఆలయ ప్రవేశం కోసం రూ.100 అడిగి కులం పేరుతో దూషిస్తూ కొట్టాడని ఫిర్యాదు చేసిందని ఎస్పీ సంగ్రామ్ సింగ్  పాటిల్  తెలిపారు. ‘‘ఆరోజు సాయంత్రం రెడ్డి కులానికి చెందిన కొందరు తన భర్తను ఒక గదిలో బంధించి ఇనుపరాడ్లు, కొబ్బరికాయలతో దాడి చేశారని మౌనిక చెప్పింది. ‘తన భర్తను కొట్టవద్దంటూ తన పాపను వారి పాదాల దగ్గర పెడితే సంగం మధురెడ్డి కాళ్లతో పాపను తంతే రెండు మీటర్ల దూరంలో పడింది. ఆ దెబ్బలతోనే పాప చనిపోయింది’ అని మౌనిక తన ఫిర్యాదులో ఆరోపించింది. ఆ ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్ట్  కింద కేసు నమోదు చేసి నాగర్ కర్నూల్ డీఎస్పీ విచారణ ప్రారంభించారు’’ అని ఎస్పీ వెల్లడించారు. ఈనెల 18న గణేశ్​ ఇచ్చిన ఫిర్యాదులో భార్య, పసిపాపపై దాడి చేసినట్లుగానీ, శ్రీనివాస్​రెడ్డి తన భార్యను కులం పేరుతో దూషించినట్టుగానీ పేర్కొనలేదని తెలిపారు. గుడిలో దాడి అనంతరం చిన్నారికి ఎక్కడ ట్రీట్​మెంట్​ ఇప్పించారో చెప్పలేదని పేర్కొన్నారు. ఎస్సీఎస్టీ కేసులో పరిహారం అందించేందుకు ఆర్డీఓ, తహసీల్దార్లు మౌనిక ఆధార్, రేషన్​కార్డు, ఓటర్​ కార్డు జిరాక్స్​ అడిగినా ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. ఈ కేసులో హిస్టోపాథాలజీ, విస్రా రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. చిన్నారి మృతిపై తమకు సానుభూతి ఉందని, పోలీసు విచారణకు కుటుంబ సభ్యులు సహకరించాలని ఎస్పీ కోరారు.