
- 18 ఏండ్ల తర్వాత జులై నెలలో తెరుచుకున్న గేట్లు
- దిగువకు 2,48,253 క్యూసెక్కుల నీటి విడుదల
- మంత్రి అడ్లూరితో కలిసి గేట్లు ఎత్తిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఆధునీకరిస్తమని వెల్లడి
హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ నుంచి 18 ఏండ్ల తర్వాత జులై నెలలోనే గేట్లు ఎత్తి నీటి విడుదల చేయడం సంతోషంగా ఉందని ఇరిగేషన్‌మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన సాగర్ 26 క్రస్ట్ గేట్లను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సాగర్ ద్వారా రాష్ట్రంలో 6 లక్షల 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు సీజన్లలో 2 లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించడంలో నాగార్జున సాగర్ పాత్ర కీలకమని తెలిపారు. నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు రోజుల్లో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను మోడర్నైజ్చేస్తామని, జలాశయాల్లో పూడిక తీస్తామని చెప్పారు. మంత్రులు సాగర్ ఎడమకాల్వ హెడ్ రెగ్యులెటర్ వద్ద వాయినం సమర్పించి, ఎడమకాల్వకు నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అధికారులు డీఎస్ చౌహన్, ఇలా త్రిపాఠి, చంద్ర పవర్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం వరకు 26 గేట్ల ద్వారా 2,48,253 క్యూసెక్కుల నీటిని వదలనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు..
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. మంత్రి అడ్లూరితో కలిసి నల్గొండ జిల్లా పెద్దవూరలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎనిమిది లక్షల కార్డులు ఇచ్చామన్నారు. కొత్తగా 35లక్షల మంది లబ్ధిదారుల చేరికతో మొత్తం సంఖ్య 3 కోట్ల 15 లక్షలకు చేరిందని వివరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే కొత్తగా 10,800 కార్డు ఇస్తున్నామన్నారు. పేదల కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత పవర్, రైతు రుణమాఫీ, రైతుభరోసా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
సాగర్‌కు 2.55 లక్షల క్యూసెక్కుల వరద
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతుడడంతో మొత్తం 26గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి 2,47,003 క్యూసెక్కు నీటిని దిగువన పులిచింతల ప్రాజెక్టుకు వదులుతున్నారు. సాగర్పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.60 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. డ్యామ్ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.8626 టీఎంసీల నీరు ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,623 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 6,041 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 6,402 క్యూసెక్కుల నీటిని, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 300క్యూసెక్కుల నీటిని మొత్తం 2,47,213 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గతంలో 2006, 2007లో జులైలోనే సాగర్ గేట్లు ఎత్తారు. ఆ తర్వాత 18 ఏంట్ల మళ్లీ ఇప్పుడు జులైలో గేట్లు ఓపెన్ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
నాగార్జున సాగర్ నిండుకుండలా మారడం, ప్రాజెక్ట్ గేట్లను ఎత్తిన నేపథ్యంలో దిగువ ప్రాంత, బ్యాక్‌వాటర్ నిలిచే ఏరియాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నది పరివాహక ప్రాంత ప్రజలు ఈత కొట్టేందుకు, బట్టలు ఉతికేందుకు నదిలోకి వెళ్లవద్దని, పశువులను నదిలోకి తీసుకువెళ్లడం, నది దాటించే ప్రయత్నం చేయవద్దన్నారు. అలాగే మత్స్యకారులు చేపలవేటకు నదిలోకి వెళ్లకూడదని ఆదేశించారు.