బౌద్ధారామాలు పట్టవా?: నిర్లక్ష్యంగా బుద్ధుడి విగ్రహాలు

బౌద్ధారామాలు పట్టవా?: నిర్లక్ష్యంగా బుద్ధుడి విగ్రహాలు

హైదరాబాద్‌, వెలుగు: అవి తెలంగాణకు 2 వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉందని చెప్పిన చారిత్రక ఆనవాళ్లు. ప్రపంచానికి శాంతి, అహింసను బోధించిన ప్రదేశాలు. రెండు శతాబ్దాల కిందటే దేశ, విదేశీయులను ఆకర్షించిన ఆరామాలవి. పట్టించుకునేవారే లేక ఇప్పుడు ఆ బౌద్ధారామాలు వెలవెలబోతున్నాయి. ఇక్కడ లభించిన బుద్ధుడి విగ్రహాలు మ్యూజియాలకు చేరగా.. ఆ ప్రదేశాలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నాగార్జునసాగర్ సమీపంలో బుద్ధవనం పేరిట కొత్త ఆరామాన్ని నిర్మించారే తప్ప ప్రాచీన కాలం నాటి ఆరామాలను పూర్తిగా విస్మరించారన్న విమర్శలు  వినిపిస్తున్నాయి.

ఎక్కడెక్కడ ఎట్ల?

రాష్ట్రంలోని నాగార్జునకొండ, నేలకొండలపల్లి, కొండాపూర్, నాగారం, వర్ధమానుకోట, గాజులబండ, కోటిలింగాల, ఫాసిగాం, ఫణిగిరి, ధూళికట్ట, తిరుమలగిరి ప్రాంతాల్లో బౌద్ధారామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గతంలో జరిపిన తవ్వకాల్లో విహారాలు, స్థూప చైత్యాలు, నాణేలు, శాసనాలు బయటపడ్డాయి. ఉత్తర భారతదేశాన్ని దక్షిణాదితో కలిపే ఒకప్పటి జాతీయ రహదారిపై బౌద్ధ భిక్షువుల ఆవాసంగా విరాజిల్లిన ఫణిగిరిలో ఇప్పటివరకు ఆరు విడతలుగా తవ్వకాలు జరిపి పలు బౌద్ధ చిహ్నాలను, బుద్ధుడి విగ్రహాలను బయటికి తీశారు.  ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లభ్యమైన బుద్ధ విగ్రహాలు పిల్లలమర్రి, తెలంగాణ హెరిటేజ్ మ్యూజియాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మ్యూజియంలో ఉన్నాయి. ఇక్కడ  ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  పునరుద్ధరించిన ఆరామం తప్ప ఒక్క బుద్ధ విగ్రహం లేదు.

అలాగే  సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో దొరికిన విగ్రహాలను పానగల్లు, స్టేట్ మ్యూజియానికి తరలించారు. అక్కడ  మహాస్తూపం పునర్నిర్మాణం చేసినా ప్రాచీన పద్ధతిలో కాకుండా సిమెంట్  వినియోగించి ఇటుకలు కనిపించకుండా నిర్మించడంతో సహజత్వాన్ని కోల్పోయింది. కరీంనగర్ జిల్లా ధూళికట్టలో లభ్యమైన విగ్రహాల్లో కొన్నింటిని కరీంనగర్ జిల్లా మ్యూజియంలో, ఇంకొన్నింటిని స్టేట్ మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ  పూర్తి స్థాయిలో తవ్వకాలు నిర్వహించకపోవడంతో విహారాలు మట్టిలోనే ఉండి పోయాయని చరిత్ర పరిశోధకులు అంటున్నారు.

బ్యాక్‌వాటర్‌లో కోటిలింగాల

కోటిలింగాలలో బౌద్ధ మతానికి సంబంధించిన అనేక అవశేషాలు లభించాయి. కానీ అక్కడ సైట్‌ను అలాగే వదిలేశారు. అది శ్రీపాదసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో మునిగిపోయే ప్రమాదం ఉండడంతో చరిత్ర ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సూర్యాపేట జిల్లా వర్ధమానుకోటలో లభించిన బుద్ధుడి విగ్రహం పానగల్లు మ్యూజియంలో ఉంది. నల్లగొండ జిల్లా బిక్కేరు ఒడ్డున చాడ బౌద్ధారామంలో దొరికిన బుద్ధ విగ్రహాన్ని  శ్రీపర్వతంపై ఏర్పాటు చేసిన మ్యూజియానికి తరలించారు. ఇలా బౌద్ధారామాలలో లభ్యమైన విగ్రహాలన్నింటిని మ్యూజియాలకు తరలించిన ప్రభుత్వం ఆ తర్వాత ఈ చారిత్రక ప్రదేశాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరామాలను పాత పద్ధతిలో పునర్నిర్మించి పర్యాటక  ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.