ఇంటింటికి నల్లా నీళ్లేవి.. బీఆర్ఎస్ ఎంపీటీసీ వీడియో వైరల్

ఇంటింటికి నల్లా నీళ్లేవి.. బీఆర్ఎస్ ఎంపీటీసీ వీడియో వైరల్

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం జూన్ 18న నీళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నళ్లా నీళ్లు తెచ్చిన ఘనత తమదేనని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది అయితే ఇప్పటి వరకు మంచి నీళ్లు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.  ఈ విషయంపై ప్రజాప్రతినిధులను  చాలా చోట్ల నిలదీశారు స్థానికులు. కొన్ని చోట్ల ప్రశ్నిస్తే దాడులు చేశారు. అయితే లేటెస్ట్ గా ఓ బీఆర్ఎస్ నేత తన మండలంలో  మంచినీళ్లు రావడం లేదని.. ఇంత వరకు ఇంటింటికి మంచినీళ్లు  ఎక్కడా అని నిలదీస్తున్న  ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పులిమల కృష్ణారావు అధికార పార్టీ నేతలు, అధికారులపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దవూర మండల కేంద్రంలో ఇంత వరకు మంచినీళ్లు లేవని ప్రజలు ఎంతో ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై అధికారులకు, జనరల్ బాడీ మీటింగ్ లో , ఎమ్మెల్యేకు ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తాగడానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉందని.. వచ్చే ఎన్నికల్లో తాము ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిలదీశారు. ఓటు వేయమని ఎలా అడగాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.