టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం 'కింగ్ 100' పేరుతో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ ప్రాజెక్టులో కన్నడ కస్తూరి సుస్మితా భట్ కీలక పాత్రలో ఛాన్స్ కొట్టేసింది. గతంలో 'నాట్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ.. ఒక అగ్ర కథానాయకుడి సరసన నటిస్తూ భారీ బ్రేక్ అందుకోవడం సుస్మితకు ఇదే మొదటిసారి.
ఒకే ఫ్రేమ్‌లో టబు, నాగార్జున!
ఈ సినిమాలో సీనియర్ నటి టబు నటిస్తున్నారు. 1998లో వచ్చిన 'ఆవిడ మా ఆవిడే' తర్వాత దాదాపు 28 ఏళ్లకు నాగ్-టబు జోడీ మళ్లీ తెరపై కనిపించబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ అనగానే 'నిన్నే పెళ్లాడతా' వంటి క్లాసిక్స్ గుర్తుకు వస్తుంది. సుస్మితా భట్‌తో పాటు టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నాగార్జున గారి లాంటి సూపర్ స్టార్‌తో నటించడం నా కెరీర్‌లో దక్కిన గొప్ప అవకాశం. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది, కొన్ని భాగాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ అనుభవం మర్చిపోలేనిది అని సుస్మితా భట్ చెప్పుకొచ్చింది.
కథాంశం
'మేడ్ ఇన్ కొరియా' ఫేమ్ రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భావోద్వేగాల మేళవింపుగా ఉండబోతోంది. ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో నాగార్జునను మరింత యంగ్ లుక్‌లో చూపించబోతున్నారు.
భారీ అంచనాలతో..
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతాన్ని అందిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో వందో సినిమా కావడం, టబు రీ-ఎంట్రీ ఇవ్వడం, కొత్త తరం నటీమణులు భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ,ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.
