- మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
హాలియా, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్దవనం ప్రపంచ బౌద్ధ పర్యాటక వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్దవనంలో 2,570వ బుద్ద పూర్ణిమ ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి జాతకవనంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్దవనాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు.
పర్యాటక కేంద్రంగానే కాకుండా భిక్షువుల సాధనకు, ధ్యానానికి అనువైన పుణ్యక్షేత్రంగా, ప్రపంచ శాంతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభాతభేరి కార్యక్రమం ద్వారా ప్రజల రుగ్మతలను పోగొట్టేందుకు సాంస్కృతిక శాఖ ద్వారా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వియత్నాం దేశం నుంచి 36 అడుగుల బుద్దుడి విగ్రహం బుద్ద వనానికి బహుమతిగా రాబోతుందన్నారు. బుద్దవనంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో బుద్దుడి బోధనలు వెలుగులు నింపుతున్నాయని చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న తరుణంలో బుద్దుడి బోధనలకు మరింత ప్రాధాన్యం లభిస్తోందన్నారు. బుద్దుడి సందేశాన్ని బౌద్ధ మతస్తులతో పాటు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ముందుగా మహాబోధి బుద్దవిహార్ భిక్కు దమ్మ అతిథి సంఘపాల బంతే బుద్దుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలో బుద్ద జ్యోతులు వెలిగించి ధ్యానం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం ఎండీ గౌతమి, బుద్ద వనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు పాల్గొన్నారు.
