కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి : కలెక్టర్ బదావత్ సంతోష్
  • నాగర్ ​కర్నూల్​ కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉయ్యాలవాడ మెడికల్ కళాశాల సమీపంలోని స్కూళ్లో  ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అడిషనల్​కలెక్టర్ దేవ సహాయంతో కలిసి ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలోని ప్రతీ టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అభ్యర్థుల ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేయడంతో పాటు సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 11న జరగనున్న పోలింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ తీరును తనిఖీ చేసిన ఆయన, బ్యాలెట్ పేపర్లలోని వివరాలు ఫారం–7 ప్రకారం ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో 167వ జాతీయ రహదారి పనులపై సమీక్షించారు. కొల్లాపూర్, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ పరిధిలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, బాధితులకు పరిహార చెల్లింపులను వేగవంతం చేయాలని రెవెన్యూ, జాతీయ రహదారి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘బౌరాపూర్ జాతర’ను ఘనంగా నిర్వహించాలి

నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ (బౌరాపూర్) వద్ద వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతరను ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్రతో కలిసి జాతర ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే ఈ జాతరలో ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరుగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. 15న స్వామివారి కల్యాణ మహోత్సవం, రథోత్సవాలకు ఆదివాసీ పూజారులతో సకల మర్యాదలు పూర్తి చేయాలని చెప్పారు.

భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, భోజన వసతులలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. జాతర ప్రాంగణంలో వైద్య శిబిరాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, డీఎంహెచ్​ఓ రవికుమార్, ఐటీడీఏ అధికారులు, చెంచు నాయకులు పాల్గొన్నారు.