కుమ్మెర చిన్నారి మృతిని రాజకీయం చేసిన్రు..వాస్తవాలను దాచి అబద్ధాలు ప్రచారం చేశారు

కుమ్మెర చిన్నారి మృతిని రాజకీయం చేసిన్రు..వాస్తవాలను దాచి అబద్ధాలు ప్రచారం చేశారు
  • ప్రభుత్వాన్ని బద్నాం చేసి పూట గడుపుకుంటారా ? 
  • కాంగ్రెస్‌‌‌‌ నిజ నిర్ధారణ బృందం సభ్యులు

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, వెలుగు : ‘నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నరు, చిన్నారి మృతిని రాజకీయం చేశారు’ అని కాంగ్రెస్‌‌‌‌ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దానిని ప్రభుత్వంతో ముడిపెట్టి సీఎం నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలను బద్నాం చేసి పూట గడుపుకుందామని చూస్తున్నారని అని మండిపడ్డారు. 

నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ ఎంపీ మల్లు రవి నేతృత్వంలో అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌‌‌‌రెడ్డి, షాద్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆదివాసీ కాంగ్రెస్‌‌‌‌ జాతీయ అధ్యక్షుడు, ట్రైకార్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బెల్లయ్య నాయక్​, మైనార్టీ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఒబేదుల్లా కొత్వాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ రాజేందర్‌‌‌‌తో పాటు పలు మున్సిపాలిటీలు, మార్కెట్‌‌‌‌ కమిటీల చైర్మన్లు, కాంగ్రెస్‌‌‌‌ నాయకులతో కూడిన నిజనిర్ధారణ టీమ్‌‌‌‌ శుక్రవారం సాయంత్రం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. 

గ్రామంలో అన్ని మతాలు, కులాలకు చెందిన పెద్దమనుషులతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, పూజారులతో మాట్లాడి చిన్నారి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. గుడిలో దర్శనానికి రూ.100 టికెట్‌‌‌‌ పెట్టలేదన్న గుడి పూజారులు, కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి రూ.50 తీసుకుంటే గుడికి అంటగట్టడం సమంజసం కాదన్నారు. బాధితుడు గణేశ్‌‌‌‌ తల్లి చంద్రకళ, చిన్నమ్మలు దర్శనానికి వస్తే క్యూలైన్‌‌‌‌లో రమ్మని చెప్పడంతో తమతో వాగ్వాదానికి దిగారని వివరించారు. 

బారికేడ్లు తీసి వారికి దర్శనం చేయించినప్పటికీ... గుడి బయట ఉన్న గణేశ్‌‌‌‌కు కాల్‌‌‌‌ చేసి తమను గుడిలోకి రానివ్వలేదని చెప్పారని సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో గణేశ్‌‌‌‌ గ్రామ పెద్దలను బూతులు తిడుతూ వాట్సప్‌‌‌‌లో ఆడియో పెట్టడంతో గణేశ్‌‌‌‌కు, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారని, దానిని సామూహిక దాడిగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 

గణేశ్‌‌‌‌ను కొబ్బరికాయల గదిలోకి పంపిస్తే అక్కడ మళ్లీ వాగ్వాదం జరిగిందన్నారు. ఆ సమయంలో మౌనికతో పాటు చిన్నారి గుడి బయట ఉన్నారని, కానీ తల్లీపిల్లను కాలితో తన్ని చంపినట్లు ప్రచారం చేయడం దారుణమని వివరించారు. అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ... కుమ్మెర ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విచారణలో అన్ని నిజాలు బయటపడుతాయని, నిందితులు ఎవరైనా శిక్ష తప్పదన్నారు. 

చిన్నారి ఫ్యామిలీకి న్యాయం చేయండి 

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా కుమ్మెరలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనలో బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్‌‌‌‌ మహరాజ్, రాజ్యసభ సభ్యుడు ఆర్‌‌‌‌.కృష్ణయ్య, జస్టిస్‌‌‌‌ ఈశ్వరయ్య, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు చిన్నారి తల్లిదండ్రులు గణేశ్‌‌‌‌, మౌనికతో వెళ్లి డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు.