షీర్‌బాగ్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ క్రైమ్స్ డీసీపీ చైతన్య కుమార్‌ను బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో కలిసి కంప్లైంట్ చేశారు.
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తదితరులు నైమిషా రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కంప్లైంటులో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, సంబంధిత పత్రాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. ఈ అంశంపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరపాలన్నారు. తప్పుదారి పట్టించే సమాచారాన్ని సృష్టించి ప్రచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
