- షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు అనుమానాలు
నార్కట్ పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానం వద్ద ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో 17 దుకాణాలు పూర్తిగా కాలిపోగా, రూ. 3 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గ్రామంలోని రంగ శ్రవణ్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 15 నిమిషాల్లోనే మంటలు పెరిగి పక్కనే ఉన్న 17 దుకాణాలకు అంటుకున్నాయి.
షాపుల్లో మొత్తం ప్లాస్టిక్ బొమ్మలే ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడే ఉన్న ఓ భక్తురాలు మంటలను గమనించి ఫైర్ ఇంజిన్, పోలీసులకు సమాచారం అందించారు. నల్గొండ, నార్కట్ పల్లి సీఐలు ఆదిరెడ్డి, సురేశ్, ఎస్సై విష్ణుమూర్తి వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఓ షాపులో ఉన్న సిలిండర్ కు మంటలు అంటుకొని అది పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. దీంతో దుకాణాల పక్కనే నివాసం ఉండే ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
కానీ రెండు ఫైర్ ఇంజిన్లు మాత్రమే అందుబాటులో ఉండడం, అవీ ఆలస్యంగా రావడంతో మంటలు మరింత వ్యాపించాయి. అనంతరం గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనే ఉన్న గ్రామపంచాయతీ భవనంలోని రికార్డు గదికి అంటుకోవడంతో పలు కీలక పత్రాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఇల్లు నిర్మించుకునేందుకు తెచ్చుకున్న రూ. 40 లక్షలతో పాటు, 25 తులాల బంగారం కాలిపోయిందని కర్నాటి రాజ్యలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్కో దుకాణంలో సుమారు రూ. 14 లక్షల విలువైన సరుకు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో మొత్తం రూ. 3 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్న ఆఫీసర్లు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. షాపులు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
