చిట్యాల, వెలుగు : వేగంతో డ్రైవ్ చేయడం కాదని, ప్రాణాలతో ఇంటికి చేరడం ముఖ్యమని డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాస్ రావు, ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం లేదనే తొందర, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టిందన్నారు.
వెల్దుర్తి : రోడ్డు ప్రయాణంపై వాహనదారుల్లో మరింత అవగాహన పెరగాలని అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెరిగితేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
ప్రజాపాలన-– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గ్రామ సభలో అరైవ్ అలైవ్, రోడ్డు భద్రత, పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాస్ రావుతో కలిసి అడిషనల్ డీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి ర్యాలీలో నిర్వహించారు.
