- మరో ఎనిమిది మందికి గాయాలు.. చిట్యాల మండలంలో ప్రమాదం
చిట్యాల, వెలుగు : ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఓ వ్యక్తి చనిపోగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామశివారులో ఉన్న నోయిస్ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బాలకృష్ణ (32)తో పాటు వివిధ గ్రామాలకు హరిప్రసాద్‌రావు, లోకేశ్, శంకర్, డేవిడ్, లింగస్వామి, వెంకటేశ్వరరావు, మరికొంత మంది శుక్రవారం మధ్యాహ్నం కంపెనీలోని బ్లాక్–3లో ఉన్న లాన్సో ప్రజోల్ ఇంటర్మీడియట్ యూనిట్ వద్ద పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో రియాక్టర్‌లో మెటీరియల్ లోడ్ చేసిన వెంటనే ఉష్ణోగ్రత పెరగడంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. రియాక్టర్ సమీపంలో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని డీఆర్‌డీఓ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బాలకృష్ణ చనిపోయాడు. 20 రోజుల క్రితమే ఇదే కంపెనీలోని రియాక్టర్ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు మరో ప్రమాదం జరగడంపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాదాలకు కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్ కంపెనీని పరిశీలించారు. ప్లాంట్‌లోని అన్ని బ్లాక్‌లలో పనులను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కంపెనీని సీజ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
