
వన్డే మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లుంటాయి. తమకు నచ్చిన అంకెలు కూడా వేసుకుంటారు. కానీ టెస్టుల్లో మాత్రం అలాంటిదేమీ ఉండదు. 142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ మ్యాచ్‌లో కూడా ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, అంకెలు కనిపించింది లేదు. ఆటగాళ్లు తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. వెనుక భాగంలో ఖాళీ వదిలేస్తారు తప్ప పేర్లు, అంకెలు రాయరు. అయితే టెస్ట్ క్రికెట్ లో కూడా మార్పు రానుంది. ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆగస్టు 1న జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు జెర్సీలపై పేర్లు, అంకెలతో కనిపించనున్నారట. ఈ కొత్త సంప్రదాయం కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ఐసీసీకి ప్రతిపాదన పంపనున్నాయట. ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… టెస్టుల్లో తొలిసారి ఆటగాళ్లు పేర్లున్న జెర్సీలతో కనిపించనున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఈ మ్యాచ్‌తోనే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆరంభమవుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డుల ప్రతిపాదనకు ఐసీసీ ఆమోదం తెలిపితే.. మున్ముందు మరిన్ని జట్లు ఇదే బాటను అనుసరించవచ్చంటున్నారు క్రికెట్ నిపుణులు.