వృద్ధ తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుక్కి 2 నెలల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు

వృద్ధ తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుక్కి 2 నెలల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు

కన్నవారినే కంటిపాపలా చూసుకోవాల్సిన ఒక కుమారుడు.. కసాయిలా మారి కన్నతల్లిదండ్రులపైనే దాడులకు తెగబడ్డాడు. నవమాసాలు మోసి పెంచిన వృద్ధ తల్లిదండ్రులను  వేధిస్తూ, చిత్రహింసలకు గురిచేసిన ఓ ప్రబుద్ధుడికి నాంపల్లి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ ఉద్యోగి. అయితే, అతను గత కొంతకాలంగా తన వృద్ధ తల్లిదండ్రులను తీవ్రంగా కొడుతూ, హింసిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని గమనించిన పొరుగువారు.. శ్రీనివాస్ తన తల్లిదండ్రులపై దాడి చేస్తున్న దృశ్యాలను గుట్టుచప్పుడు కాకుండా తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు.

ఆ వీడియో ఆధారాలతో బాధిత వృద్ధులను తీసుకుని పొరుగువారే స్వయంగా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసును విచారించిన నాంపల్లి న్యాయస్థానం.. కన్నవారిపై దాడికి పాల్పడటం క్షమించరాని నేరమని స్పష్టం చేస్తూ, నిందితుడు శ్రీనివాస్‌కు రెండు నెలల జైలు శిక్షతో పాటు, 50 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే నిందితుడు వికలాంగుడు అయినప్పటికీ.. కన్నవారిపై అతను చేసిన దాడులను కోర్టు తీవ్రంగా పరిగణించింది.