గచ్చిబౌలి, వెలుగు: పేదల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన జీవో నం.59ను అడ్డుపెట్టుకొని కొందరు అక్రమార్కులు ఐటీ కారిడార్ లోని రూ. వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేస్తున్నారని.. దీనిపై విచారణ చేపట్టాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. జీవో నం.59 కింద చేసిన రెగ్యులరైజేషన్లను రద్దు చేయాలన్నారు. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ నానక్ రాంగూడలోని సర్వే నం.149 లోని ప్రభుత్వ స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నానక్ రాంగూడలోని సర్వే నం.149లో 82 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో కోడ్ అమల్లో ఉండగానే రెవెన్యూ అధికారుల అండతో కొందరు ఈ భూమిలోని 7 ఎకరాలను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు రెండ్రోజులు ముందు, రిజల్ట్స్ వచ్చిన రెండ్రోజుల తర్వాత మొత్తం 4 విడతల్లో జీవో నం.59 కింద ఈ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
గోపన్ పల్లికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్, అతడి కుటుంబసభ్యులు, అనుచరుల పేరు మీద వేల గజాల చొప్పును స్థలం రెగ్యులరైజ్ అయ్యిందని.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ స్థలం నిర్మాణ సంస్థల చేతుల్లోకి వెళ్లిందని అరికెపూడి గాంధీ ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించిన కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
