Balakrishna: సూర్యచంద్రులున్నంత కాలం ఎన్టీఆర్ బతికే ఉంటారు.. తండ్రి జ్ఞాపకాలతో బాలకృష్ణ ఎమోషనల్

Balakrishna: సూర్యచంద్రులున్నంత కాలం ఎన్టీఆర్ బతికే ఉంటారు.. తండ్రి జ్ఞాపకాలతో బాలకృష్ణ ఎమోషనల్

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆదివారం (జనవరి 18) ఎన్టీఆర్ కుమారుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..“ఎన్టీఆర్ అంటే కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు. తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మహానాయకుడు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా ఎన్టీఆర్ నిలుస్తారు. కుల, మత భేదాలు లేకుండా ఆయన నటన ప్రతి హృదయాన్ని ఆకట్టుకుంది. కళామాత సేవలో ఎన్నో విభిన్న ప్రయోగాలు చేసి నటనాచార్యుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి. పేదల ఆకలి తీర్చిన ‘అన్న’గా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించిన నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచారు. వృద్ధాప్య పింఛన్, రెండు కిలోల బియ్యం పథకం, తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటి పథకాలు ఆయన మానసపుత్రికలుగా నిలిచాయి.

►ALSO READ | Raj Tarun: మాస్‌ ఆడియన్సే లక్ష్యంగా రాజ్ తరుణ్ మూవీ.. ఆకట్టుకుంటున్న ‘రామ్ భజరంగ్’ గ్లింప్స్‌

ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రజల అభివృద్ధి కోసం నడుం బిగించాలి. విశ్వం ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానాయకుడు ఎన్టీఆర్. భగవద్గీత లాంటి గొప్ప జీవితం ఆయనది. అలాంటి వ్యక్తి కుటుంబంలో జన్మించడం మా అదృష్టం. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు” అని బాలకృష్ణ భావోద్వేగంగా మాట్లాడారు. ఇకపోతే, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సైతం తాత ఎన్టీఆర్కు నివాళులర్పించారు.