నాకు 63 ఏళ్లు అయినా..36 లాగే ఫీలవుతా..

నాకు 63 ఏళ్లు అయినా..36 లాగే ఫీలవుతా..

హాస్పిటల్ నుంచి ఒక పేషంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు అంటే అది నాకు పండగ లాంటిదని నందమూరి బాలకృష్ణ అన్నారు. చాలామంది మహానుభావులు కాలేరని..నాన్న ఎన్టీఆర్ లాంటి వారే గొప్ప గొప్ప పనులు చేస్తారని పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా బసవతారకం ఆసుపత్రిని  బాలకృష్ణ సందర్శించారు. రోగులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. 

అప్పట్లో నాన్న టిడిపిని స్థాపించడంతో పాటు ఎంతోమంది పేదల కోసం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమాన్నారు. ఈ ఆసుపత్రిని ఏ ఉద్దేశంతో అయితే స్థాపించామో..అదే ఉద్దేశంతో తాము పెట్టుకున్న ఆశయాలను నెరవేర్చేందుకు ఇందులో పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ఆసుపత్రికి తాను ఛైర్మెన్ గా ఉండటం  పూర్వజన్మ సుకృతంలాగా భావిస్తున్నాని బాలకృష్ణ పేర్కొన్నారు. దేశంలోనే రెండో గొప్ప హస్పిటల్ గా గుర్తింపు రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఉండాలని ఆయన కోరారు. మన ఆలోచనలకు బానిసగా మన శరీరాన్ని మార్చుకోవాలన్నారు. 

నటుడిగా, ఆస్పత్రికి ఛైర్మెన్ గా, ఒక ఎమ్మెల్యే గా ఎలా ఉండాలో  నాన్న ఎన్టీఆర్ ను చూసి నేర్చుకున్నాని బాలకృష్ణ తెలిపారు. తన పుట్టిన రోజును కౌంట్ డౌన్ గా పెట్టుకుంటానన్నారు. తన వయసును ఎప్పుడు తిరిగేస్తానని..ప్రస్తుతం  63 ఏండ్లు ఉన్నా కూడా..36 ఏండ్ల వయస్సు గల వ్యక్తిలా ఫీలవుతానని చెప్పారు. ఎన్టీఆర్ కూడా  చంద్రబాబు నాయుడిలాగా  ముందుచూపు గలవారని అన్నారు. ఈ దేశం, ఈ సమాజం  తనకు ఏమిచ్చింది అనే కన్నా... మనం ఏమిచ్చాము అనేవిధంగా ఉండాలని బాలకృష్ణ సూచించారు. మనమంతా నిస్వార్థంగా పనిచేద్దామని... ఇకముందు కూడా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.